సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. ప్రపంచకప్ నుంచి స్టార్ ఓపెనర్ ఔట్..!
భారత ఓపెనర్ ప్రతీకా రావల్ ప్రస్తుతం జరుగుతున్న ICC మహిళల ODI ప్రపంచ కప్ 2025 నుండి నిష్క్రమించింది.
By - Medi Samrat |
భారత ఓపెనర్ ప్రతీకా రావల్ ప్రస్తుతం జరుగుతున్న ICC మహిళల ODI ప్రపంచ కప్ 2025 నుండి నిష్క్రమించింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన టోర్నమెంట్‌లోని చివరి లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రావల్ చీలమండ గాయంతో బాధపడింది.
నేవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బౌండరీకి సమీపంలో ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రతీకా రావల్ జారిపడి నొప్పితో కేకలు వేయడం ప్రారంభించింది. వెంటనే ప్రతీకా రావల్‌ను మైదానం నుండి స్టాండ్స్ వైపు తీసుకెళ్లారు. ఆపై తిరిగి ఫీల్డ్‌కి రాలేదు. ఆ తర్వాత మ్యాచ్ రద్దు చేయబడింది.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. నొప్పితో బాధపడుతున్న 25 ఏళ్ల ప్రతీకా రావల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు స్కాన్‌లు జరిగాయి. వార్త రాసే సమయానికి.. ప్రతీక వైద్యులను కలవవలసి ఉందని తెలిసింది. సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఇది భారీ దెబ్బ.
అక్టోబర్ 30న డివై పాటిల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ సెమీ ఫైనల్ ఆడాల్సి ఉంది. డిసెంబర్ 2024లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్.. మొదటి సంవత్సరంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇటీవల న్యూజిలాండ్‌పై వన్డే ప్రపంచకప్‌లో తొలి సెంచరీని కూడా నమోదు చేసింది. దీంతో ఆమె మహిళల ODIలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో సంయుక్తంగా మొదటిస్థానంలో నిలిచింది.
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోవికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ గాయపడటంతో భారత జట్టు ఇప్పటికే ఆందోళన చెందుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోష్‌కు విశ్రాంతి ఇవ్వగా, ఆమె స్థానంలో ఉమా ఛెత్రికి అరంగేట్రం చేసే అవకాశం లభించింది.
వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 27 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. స్మృతి మంధానతో కలిసి అమంజోత్ కౌర్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాత వర్షం కారణంగా తదుపరి మ్యాచ్ ఆడలేకపోయింది.