ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లను వెంటాడుతున్న కరోనా..!

Prasidh Krishna tests positive for Covid-19. ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా మధ్యలోనే వాయిదా పడిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  8 May 2021 2:25 PM GMT
ఐపీఎల్ ఆడిన ఆటగాళ్లను వెంటాడుతున్న కరోనా..!

ఈ ఏడాది ఐపీఎల్ కరోనా కారణంగా మధ్యలోనే వాయిదా పడిన సంగతి తెలిసిందే..! ఐపీఎల్ లో ఆడిన ఎంతో మంది ఆటగాళ్లను కరోనా వెంటాడుతూ ఉంది. సీజన్ మధ్యలోనే ఆటగాళ్లకు కరోనా సోకడంతో.. ఐపీఎల్ ను వాయిదా వేశారు. ఒకరి తర్వాత ఇంకొక ఆటగాడు కరోనా బారిన పడడం.. చాలా ఫ్రాంచైజీలు రిస్క్ తీసుకోలేకపోవడంతో ఐపీఎల్ వాయిదా పడింది. తాజాగా మరో క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. అతడు మరెవరో కాదు కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఐపీఎల్ ముగియడంతో ప్రసిద్ధ్ కృష్ణ మే 3న ఐపీఎల్ బబుల్ ను వీడి స్వస్థలం బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరులో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం తన స్వస్థలం బెంగళూరులోనే హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లండ్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు స్టాండ్ బైగా ప్రసిద్ద్ కృష్ణ ఎంపికైనప్పటికీ అతడికి కరోనా సోకడంతో టూర్ కు వెళ్లడం కష్టమేనని తెలుస్తోంది. ప్రసిద్ధ్ కృష్ణ కు కూడా కరోనా వచ్చిందని తెలియడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో కరోనా పాజిటివ్ ఆటగాళ్ల సంఖ్య నాలుగుకి పెరిగింది. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, టిమ్ సీఫెర్ట్ లకు కరోనా సోకగా.. వరుణ్ చక్రవర్తి స్నేహితుడైన ప్రసిద్ధ్ కృష్ణకు కూడా కరోనా సోకింది. వరుణ్ చక్రవర్తి నుంచి సందీప్ వారియర్ కు, ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా సోకిందని బీసీసీఐ వర్గాలు వివరించాయి.

ఇంగ్లండ్ వెళ్లే టీమిండియా ఆటగాళ్లకు మే 25 నుంచి బయోబబుల్ ఏర్పాటు చేస్తుండగా, ఆ సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ కోలుకుంటాడని బీసీసీఐ ఆశాభావంతో ఉంది. ఇంగ్లాండ్ వెళ్లేముందే భార‌త జ‌ట్టు క్రికెట‌ర్లు 8 రోజుల పాటు బ‌యో బుల్‌లో ఉండ‌నున్నారు. ఆ త‌రువాత‌నే వారు ఇంగ్లాండ్ వెళ్లి అక్క‌డ 10 రోజుల త‌ప్ప‌నిస‌రి క్వారంట‌న్‌లో ఉండ‌నున్న‌ట్లు బీసీసీఐ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ త‌ర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఆ సిరీస్ సెప్టెంబ‌ర్ 14న ముగుస్తుంది. అంటే మూడు నెల‌ల‌కుపైనే క్రికెట‌ర్లు ఇంగ్లాండ్ లోనే ఉండ‌నున్నారు. దీంతో ప్లేయ‌ర్స్ త‌మ వెంట కుటుంబ స‌భ్యుల‌ను కూడా తీసుకెళ్లే అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆ బీసీసీఐ అధికారి చెప్పారు.
Next Story
Share it