SRH vs CSK: ఉప్పల్ స్టేడియంకు కరెంట్ కష్టాలు
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరించబడింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 April 2024 6:46 AM ISTSRH vs CSK: ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
ఏప్రిల్ 5న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య ఉప్పల్ స్టేడియంలో కీలక మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం ఉండగా.. తెలంగాణ విద్యుత్ పంపిణీ శాఖ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి రూ. 1.63 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లించని కారణంగా విద్యుత్తును నిలిపివేసింది.
న్యూస్‌మీటర్‌తో డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక ఉన్నత అధికారి మాట్లాడుతూ, 'రూ. 1.63 కోట్ల పెండింగ్ బిల్లును క్లియర్ చేయడానికి మొదటి నోటీసు ఫిబ్రవరి 2024లో జారీ చేసాం. అనేకసార్లు వారికి ఈ విషయాన్ని తెలియజేసినప్పటికీ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) పెండింగ్ బిల్లులను చెల్లించడానికి పట్టించుకోలేదు. గత ఏడేళ్లుగా రూ.1.63 కోట్ల విద్యుత్ బిల్లు పెండింగ్ లో ఉంది. అంతకుముందు కరెంటు బిల్లు కట్టడానికి సమయం పడుతుందంటూ హెచ్‌సీఏ హైకోర్టును ఆశ్రయించింది. సామాన్యులు కరెంట్ చెల్లించకుంటే కరెంట్ కట్ చేస్తూ ఉంటాం.. అలాంటిది హైదరాబాద్ క్రికెట్ స్టేడియం విషయంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ఆ అధికారి ప్రశ్నించారు.
రూ. 3,05,12,790 (బకాయి 1,41,18,269/-+ సర్‌ఛార్జ్ - 1,63,94,521/- ఎనర్జీ దొంగతనం కేసుకు సంబంధించి) చెల్లింపు కోసం HCAకి ఫిబ్రవరి 2024లో నోటీసు జారీ చేశారు. ప్రతివాదులు బకాయి మొత్తంలో 50 శాతం అంటే రూ.1,41,18,269 చెల్లించడానికి లోబడి HCA సర్వీస్ కనెక్షన్‌కు వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని మధ్యంతర ఆదేశాలు వచ్చాయి. బకాయి మొత్తంలో మిగిలిన 50 శాతంలో, 25 శాతం HCA ద్వారా ఏప్రిల్ 30, 2022లోపు చెల్లించాల్సి ఉండగా.. మిగిలిన 25 శాతాన్ని పిటిషనర్ అసోసియేషన్ 31 మే 2022లోపు చెల్లించాలి. అయితే ఆ విధంగా హెచ్.సి.ఏ. చెల్లింపులు జరపలేదు.
పిటిషనర్ షరతులను పాటించనట్లయితే, ప్రతివాది కార్పొరేషన్ అవసరమైన చర్య తీసుకోవచ్చని తెలుస్తోంది. స్టేడియంలో కోవిడ్, క్రికెట్ కార్యకలాపాల నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక కేసుగా సర్‌చార్జిని మినహాయించాలని అభ్యర్థిస్తూ ఎలక్ట్రిసిటీ బోర్డును హెచ్.సి.ఏ. అధికారులు అభ్యర్థించారు.
ఈ విషయంలో DISCOM తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) ఆమోదించిన టారిఫ్ ఆర్డర్‌లలోని HT టారిఫ్ సరఫరా నిబంధన No.1.2.1 నిబంధనలు, షరతుల ప్రకారం చెల్లింపులో ఆలస్యం కోసం సర్‌చార్జిని మినహాయించాలనే అభ్యర్థనను పరిగణించలేమని తెలిపింది. నిబంధన సంఖ్య 4.4లోని నిబంధన నెం.5 2004 ప్రకారం, బిల్లులలో పేర్కొన్న గడువు తేదీలోగా వినియోగదారులు బిల్లులు చెల్లించకపోతే, కాలానుగుణంగా జారీ చేయబడిన టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం బిల్లుల ఆలస్యం చెల్లింపుకు అదనపు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. అందువల్ల సర్‌చార్జి మొత్తం రూ. 1,63,94,521 చెల్లించాలని అభ్యర్థించారు. ఈ నోటీసు అందిన తేదీ నుండి (15)లోపు చెల్లించాలని కోరారు. లేకపోతే తదుపరి నోటీసు లేకుండానే డిస్‌కనెక్ట్ చేస్తామని తేల్చి చెప్పారు. అనుకున్నట్లుగానే అధికారులు ఉప్పల్ స్టేడియంకు కరెంట్ కట్ చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చిన కానీ హెచ్‌సీఏ పట్టించుకోలేదని, నోటీసులకు స్పందించకపోవడంతోనే విద్యుత్ సరఫరాను కట్ చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.
ఎట్టకేలకు వచ్చిన కరెంట్:
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత విద్యుత్ ను పునరుద్ధరించారు. 1.63 కోట్ల పెండింగ్ బిల్లును క్లియర్ చేయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ)కి ఒక రోజు సమయం ఇచ్చిందని సంబంధిత వర్గాలు న్యూస్‌మీటర్‌కి తెలిపాయి. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసినప్పటికీ, హెచ్‌సీఏ జనరేటర్లను ఏర్పాటు చేయడంతో గురువారం సాయంత్రం ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్ కు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, శుక్రవారం రాత్రి 7:30 గంటలకు SRH- CSK మధ్య IPL మ్యాచ్ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.