హర్లీన్ క్యాచ్ కు మోదీ కూడా ఫిదా..?

PM Narendra Modi lauds Harleen Deol's spectacular catch in 1st T20I against England. క్రికెట్ లో బౌండరీ లైన్ల వద్ద క్యాచ్ లను పట్టాలంటే

By Medi Samrat  Published on  11 July 2021 6:05 PM IST
హర్లీన్ క్యాచ్ కు మోదీ కూడా ఫిదా..?

క్రికెట్ లో బౌండరీ లైన్ల వద్ద క్యాచ్ లను పట్టాలంటే అద్భుతమైన అథ్లెటిజం చూపించాలి. అందుకు ఎంతో కఠిన ప్రాక్టీస్, సమయస్ఫూర్తీ అవసరం. తాజాగా భారత మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద పట్టిన స్టన్నింగ్ క్యాచ్ ను ప్రతి ఒక్కరూ వావ్ అంటూ ఉన్నారు. ఇంగ్లాండ్ జాతీయ మహిళా క్రికెట్ జట్టుతో టీ20 మ్యాచ్ లో భాగంగా హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ ను అందుకుంది. నార్తాంప్టన్ కంట్రీ గ్రౌండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఈ క్యాచ్ ను అందుకుంది హర్లీన్.

అమీ జోన్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. 19వ ఓవర్ వేసిన భారత పేసర్ శిఖా పాండే బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడింది. బౌండరీ వద్ద హర్లీన్ దాన్ని అందుకోవడం సిరీస్ కే హైలైట్. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్ సిక్స్‌గా వెళ్తోన్న ఆ బంతిని గాల్లోకి ఎగిరి అందుకుంది. ఈ క్రమంలో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయింది. బంతితో సహా బౌండరీ లైన్‌ లోపలికి వెళ్లబోయింది. దీన్ని గమనించిన వెంటనే హర్లీన్ డియోల్ మెరుపువేగంతో బంతిని బౌండరీకి ఇవతల గాల్లోకి విసిరేసింది. బౌండరీ లైన్ లోపల అడుగుపెట్టి.. మళ్లీ దాన్ని డైవ్ చేసి క్యాచ్‌గా అందుకుంది. ఈ మ్యాచ్ భారత్ ఓడిపోయినప్పటికీ హర్లీన్ క్యాచ్ గురించి ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు గుప్పించారు. సూపర్ విమెన్ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.

పలువురు ప్రముఖులు ఆమె క్యాచ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ క్యాచ్ పై స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సోషల్ మీడియాలో ఆమె క్యాచ్ పట్టిన తీరును ప్రశంసించారు. హర్లీన్ క్యాచ్ యొక్క వీడియో భారత ప్రభుత్వ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేయబడింది. శనివారం, పిఎం మోదీ తన ఇన్‌స్టా స్టోరీలో ఈ వీడియో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి "Phenomenal! Well done @deol.harleen304." అంటూ పొగడ్తలు కురిపించారు.


Next Story