భారత ఆటగాళ్లు బస చేసే హోటల్ సమీపంలో కూలిన విమానం..!
Plane crashes 30 km away from Indian team's hotel in Sydney. మూడు నెలల సుదీర్ఘ పర్యటన కోసం టీమ్ఇండియా ఆస్ట్రేలియా
By Medi Samrat
మూడు నెలల సుదీర్ఘ పర్యటన కోసం టీమ్ఇండియా ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. నవంబర్ 27 నుంచి ప్రారంభం అయ్యే ఈ పర్యటనలో భారత జట్టు ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌లు ఆడనుంది. కరోనా మహమ్మారి తరువాత భారత జట్టు ఆడుతున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. ఆస్ట్రేలియా దేశం నిబంధనల ప్రకారం ప్రస్తుతం కోహ్లీ సేన 14 రోజుల క్వారంటైన్‌లో ఉంది. సిడ్నీలోని పుల్‌మాన్ హోటల్లో టీమ్ఇండియా ఆటగాళ్లు బస చేస్తున్నారు.
అయితే.. నేడు సిడ్నీలో ఓ విమానం కుప్పకూలింది. ఫుట్‌బాల్, క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే క్రోమర్ పార్క్‌లో విమానం కూలిపోయినట్లు వార్తలు రావడంతో భారత అభిమానుల్లో కంగారు మొదలైంది. భారత ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారా..? అని సోషల్ మీడియాలో తెగ వెతికేతిస్తున్నారు. కాగా.. భారత క్రికెటర్లు బస చేసిన హోటల్‌కి 30 కిలోమీటర్ల దూరంలో ఆ విమానం కుప్పకూలినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అది ఒక ఫ్లయింగ్ స్కూల్‌కు చెందిన విమానం. అందులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. కాగా.. వారిద్దరూ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అందులో ఒక ఫైలెట్‌కి మాత్రం ముఖానికి తీవ్ర గాయం కాగా.. మరొకరికి వెన్నుముక దెబ్బతిన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. వాస్తవానికి క్రోమర్ పార్క్‌లో విమానం కూలే సమయానికి అక్కడ 12 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. విమానం నుంచి దట్టమైన పొగ వ్యాపించిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.