2025 ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్ లలో.. మూడు ఓటములు ఎదురవ్వడం పాకిస్తాన్ క్రికెటర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. విదేశీ T20 లీగ్‌లలో పాల్గొనే ఆటగాళ్లకు అన్ని నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్‌లను (NOCలు) నిలిపివేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్ణయించినట్లు సమాచారం. NOCలను నిలిపివేయడానికి గల కారణాన్ని బోర్డు పూర్తిగా వెల్లడించలేదు. కానీ ఈ నిర్ణయాన్ని ఆటగాళ్లకు తెలియజేశారు. SA20, ILT20, BBL వంటి విదేశీ లీగ్‌లు రాబోయే నెలల్లో ప్రారంభం కాబోతూ ఉండడంతో పాకిస్తాన్ బోర్డు తీసుకున్న నిర్ణయం పలు ఆటగాళ్లకు ఇబ్బందికరంగా మారనుంది. ఈ లీగ్‌లలో పాల్గొనడానికి అనుమతించకపోతే, పాకిస్తాన్ ఆటగాళ్లు భారీ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కూడా ఉంది.
సెప్టెంబర్ 29న PCB చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఈ నిర్ణయం గురించి తెలిపారు. బిగ్ బాష్ లీగ్, ILT20 వంటి ప్రముఖ లీగ్‌లలో బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్‌తో సహా అనేక మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడాలని నిర్ణయించుకోగా, ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో వీళ్ళ లీగ్ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారతదేశం చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఈ సస్పెన్షన్ నిర్ణయం పీసీబీ నుండి వచ్చింది.