ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసే వ్యక్తి కావాలి - హైదరాబాద్ కెప్టెన్
సొంతగడ్డపై ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat
సొంతగడ్డపై ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ నిరాశను వ్యక్తం చేశాడు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. అనంతరం లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ జట్టులో పాట్ కమిన్స్ రెండు వికెట్లు తీశాడు.
ఓటమి అనంతరం పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. గత మ్యాచ్ పిచ్ వేరు, ఈరోజు వేరు. 'ఆ రోజు వికెట్ భిన్నంగా ఉంది, '190కి చేరుకోవడం చాలా మంచి ప్రయత్నం. మొన్న ఇషాన్ కిషన్ లాగానే ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసే వ్యక్తి మాకు ఎల్లప్పుడూ అవసరం. కానీ వారు బాగా బౌలింగ్ చేశారు. మాకు అవకాశం ఇవ్వలేదు. మాకు 8 మంది బ్యాట్స్‌మెన్ ఉన్నారు. ఎవరూ ఎక్కువ ప్రభావం చూపలేకపోయారు. మనం ఏమి బాగా చేయగలమో, ఏ మార్పు చేయగలమో చూస్తాం. ఇది సుదీర్ఘ పోటీ.. అతి త్వరలో మాకు అవకాశాలు లభిస్తాయి. కాబట్టి మనం ముందుకు సాగాలి.