ఆసీస్‌తో తొలి టీ20కు ముందు తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను ఫిక్స్ చేసిన‌ మాజీ క్రికెట‌ర్‌..!

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

By -  Medi Samrat
Published on : 28 Oct 2025 8:22 AM IST

ఆసీస్‌తో తొలి టీ20కు ముందు తిల‌క్ వ‌ర్మ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను ఫిక్స్ చేసిన‌ మాజీ క్రికెట‌ర్‌..!

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా జరగనుంది. ఇటీవల మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయిన టీమ్ ఇండియా, ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు, భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ తనకు ఇష్టమైన ప్లేయింగ్ 11ని ఎంచుకున్నాడు. ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్ జోడీపై పటేల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. మూడో నంబర్‌కు తిలక్ వర్మ సరిపోతాడని ఆయన అభివర్ణించారు. తిలక్ వర్మ జ‌ట్టు అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు వివిధ స్థానాల్లో త‌నేంటో నిర‌పిచుకున్నాడు. ఇటీవ‌లి మ్యాచ్‌ల‌లో త‌న‌ను మూడో స్థానంలో బ్యాటింగ్ పంప‌గా.. విజ‌య‌వంతంగా ప‌రుగులు చేసి త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ఆ త‌ర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాల్గవ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా ఉంటాడు. పార్థివ్ పటేల్ సంజూ శాంసన్‌ను ఐదవ స్థానానికి ఎంపిక చేసి వికెట్ కీపింగ్ బాధ్యతను కూడా అతనికి అప్పగించాడు. ఆ తర్వాత ఎడమచేతి వాటం స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌ను ప్లేయింగ్ 11లో చేర్చుకున్నాడు. కుల్దీప్ యాదవ్‌ను త‌ప్పించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు పటేల్. శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డిలతో ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లను ఎంచుకున్నాడు. వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసి స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను జ‌ట్టులో ఉంచాడు. అలాగే ఇద్దరు ప్రధాన ఫాస్ట్ బౌలర్‌లుగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎంచుకున్నాడు.

పార్థివ్ పటేల్ ప్లేయింగ్‌ 11 :

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇటీవల ఆసియా కప్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై టీ20లో టీమ్ ఇండియాకు మంచి రికార్డు ఉంది. భారత్ ఇప్పటి వరకు ఇక్కడ 11 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఏడింటిలో విజయం సాధించింది.

Next Story