పారిస్ పారాలింపిక్స్‌లో సత్తా చాటిన భారత క్రీడాకారులు.. ఒకే రోజు నాలుగు పతకాలు
పారిస్ పారాలింపిక్స్ 2024 రెండవ రోజు భారత క్రీడాకారులు సత్తా చాటారు. అవనీ, మోనా వరుసగా బంగారు, కాంస్య పతకాలు సాధించారు
By Medi Samrat Published on 30 Aug 2024 7:15 PM ISTపారిస్ పారాలింపిక్స్ 2024 రెండవ రోజు భారత క్రీడాకారులు సత్తా చాటారు. అవనీ, మోనా వరుసగా బంగారు, కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో ఇద్దరూ పతకాలు సాధించారు. అలాగే మహిళల 100 మీటర్ల (T35) రేసులో కూడా ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇది కాకుండా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. నర్వాల్ వరుసగా రెండో పారాలింపిక్స్‌లో పతకం సాధించాడు. గత పారాలింపిక్స్‌లో మనీష్ 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్‌లో కొరియాకు చెందిన జియోంగ్డు ఫైనల్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. అతడి స్కోరు 237.4 కాగా.. నర్వాల్ 234.9 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యాంగ్ చావో 214.3 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
మహిళల 100 మీటర్ల (టీ35) రేసులో భారత్‌కు చెందిన ప్రీతీ పాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 100 మీటర్ల దూరాన్ని 14.31 సెకన్లలో అధిగమించింది. ఈ ఈవెంట్‌లో చైనాకు చెందిన గువో కియాన్‌కియాన్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె 13.74 సెకన్లలో రేసును పూర్తి చేసింది. చైనాకు చెందిన హి జౌ 11.58 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
పారిస్ పారాలింపిక్స్‌లో షూటింగ్‌లో బంగారు పతకం సాధించి భారత క్రీడాకారిణి అవనీ లేఖరా చరిత్ర సృష్టించింది. మహిళల స్టాండింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ SH-1లో ఆమె ఈ బంగారు పతకాన్ని గెలుచుకుంది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. పారిస్ పారాలింపిక్స్‌లో అవనీ 249.7 స్కోరుతో బంగారు పతకాన్ని గెలుచుకుంది. దీంతో పారాలింపిక్‌లో తన రికార్డును తానే బద్దలు కొట్టింది.