బాబర్ ఆజం సరికొత్త చరిత్ర
టీ20 క్రికెట్ లో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 3:15 PM ISTటీ20 క్రికెట్ లో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ రికార్డు ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా టూర్ కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్లో మొదలుకాగా.. పాక్ కు చేదు అనుభవం ఎదురైంది.
డర్బన్లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్ సెంచూరియన్లో రెండో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో పాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్)నే ఆరంభించినా దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
ప్రపంచ రికార్డు బద్దలు
సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్ ఆజం షార్టెస్ట్ క్రికెట్లో 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు.
పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేలు 314 ఇన్నింగ్స్ అవసరమైతే.. బాబర్ 298 ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. అయితే, ఓవరాల్గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో గేల్ యూనివర్సల్ బాస్ కొనసాగుతున్నాడు.