Video : బంతి తలకు తగిలి కుప్పకూలిన స్టార్ బ్యాట్స్‌మెన్
న్యూజిలాండ్-పాక్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ ఈరోజు జరుగుతోంది.
By Medi Samrat
న్యూజిలాండ్-పాక్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇమామ్ ఉల్ హక్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నేరుగా త్రో అతని తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. మైదానం మధ్యలో నొప్పితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని చూసిన వైద్య బృందం అక్కడికి చేరుకుంది. కానీ అతను నడిచే పరిస్థితిలో కనిపించలేదు. దీంతో మైదానంలోకి అంబులెన్స్‌ను పిలవాల్సి వచ్చింది. అందులో అతను మైదానం నుండి బయటకు వెళ్లాడు.
265 పరుగుల ఛేదనకు దిగిన పాక్ జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ వచ్చారు. ఇమామ్ మూడో ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసేందుకు పరిగెత్తాడు. అయితే ఈ సమయంలో అతను గాయపడ్డాడు. ఒక త్రో నేరుగా ఇమామ్ హెల్మెట్‌కు తగిలి అతను మైదానంలో పడిపోయాడు.
— urooj Jawed 🥀 (@cricketfan95989) April 5, 2025
వేగంగా వచ్చిన బంతి అతని హెల్మెట్‌లో ఇరుక్కుపోయింది.. దానిని అతను వెంటనే తొలగించాడు.. కానీ ఆ తర్వాత అతను మైదానంలో నొప్పితో మూలుగుతూ కనిపించాడు. వెంటనే ఫిజియో బృందం మైదానానికి చేరుకుని ఇమామ్ పరిస్థితిని చూసి మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.
ఇమామ్‌కు గాయం తీవ్రంగా అనిపించి, అతను నడవడానికి కూడా వీలులేని స్థితిలో ఉన్నాడు. దీంతో మైదానంలోకి అంబులెన్స్‌ను పిలిపించాడు. అతను అంబులెన్స్ సహాయంతో మైదానం నుండి బయటకు వెళ్లాడు. అతను మళ్లీ బ్యాటింగ్‌కు రాలేడు. అతని స్థానంలో పాకిస్థాన్ జట్టు ఉస్మాన్ ఖాన్‌ను కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఎంపిక చేసింది. టీ20 సిరీస్‌లో 1-4 తేడాతో ఓడిన పాక్.. ఇప్పటికే రెండు వన్డే మ్యాచ్‌ల్లోనూ ఓడి సిరీస్‌ను సైతం పోగొట్టుకుంది.
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 264/8 పరుగులు చేసింది. ప్రస్తుతం పాక్ జట్టు 29 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు.