హ్యాండ్‌షేక్ వివాదం..ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పాక్ హెచ్చరిక
ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
By - Knakam Karthik |
ఆసియా కప్ 2025లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఆదివారం (సెప్టెంబర్ 14) దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన పాకిస్తాన్ ప్రత్యర్థి సల్మాన్ అలీ ఆఘాతో సహా పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి నిరాకరించగా, పాకిస్తాన్ జట్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
తదుపరి రోజు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. ముఖ్యంగా మ్యాచ్ రిఫరీ ఆండి పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే పోటీ నుంచి తప్పుకుంటామని స్పష్టంచేసింది. టాస్ సమయంలో హ్యాండ్‌షేక్‌ను అడ్డుకున్నారని PCB ఆరోపిస్తోంది. PCB చైర్మన్ మొహ్సిన్ నక్వీ ICCకి లేఖ రాశారు.
ఆదివారం మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ప్రెజెంటేషన్‌కు హాజరుకాకపోవడం, ఆటగాళ్లు బౌండరీ వద్ద ఎదురుచూస్తుండగా భారత ఆటగాళ్లు నేరుగా డ్రెస్‌రూమ్ వెళ్లిపోవడం వివాదానికి కారణమయ్యాయి. సూర్యకుమార్ “కొన్ని విషయాలు స్పోర్ట్స్‌మాన్‌షిప్ కంటే మిన్న” అంటూ, విజయాన్ని సైనికులకు అంకితం చేశారు.
PCB అధికారి ఉస్మాన్ వాహ్లాను కూడా ఈ వివాదంలో తగిన చర్యలు తీసుకోలేదని సస్పెండ్ చేశారు. ఇక పాకిస్తాన్ UAEతో జరగబోయే గ్రూప్ మ్యాచ్‌కి బహిష్కరిస్తే, నేరుగా టోర్నమెంట్ నుంచి బయటకే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ గ్రూప్–Aలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు భారత్ ఇప్పటికే సూపర్–4కు అర్హత సాధించింది. ICC వర్గాల ప్రకారం, హ్యాండ్‌షేక్ తప్పనిసరి కాదని, భారత్‌పై ఎటువంటి శిక్షలు ఉండబోవని స్పష్టం చేశారు. అయితే సెప్టెంబర్ 21న సూపర్–4లో భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడితే కూడా సూర్యకుమార్ హ్యాండ్‌షేక్ చేయరని సమాచారం.