పాకిస్థాన్‌కు కనీసం ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా దక్కాలి : కొత్త కోచ్ గ్యారీ కిర్‌స్టెన్
వచ్చే మూడేళ్లలో జరిగే మూడు ICC టోర్నమెంట్‌లలో కనీసం ఒక ట్రోఫీనైనా తమ జట్టు గెలవాలని పాకిస్తాన్ కొత్త కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కోరుకుంటున్నాడు
By Medi Samrat Published on 30 April 2024 6:59 AM GMTవచ్చే మూడేళ్లలో జరిగే మూడు ICC టోర్నమెంట్‌లలో కనీసం ఒక ట్రోఫీనైనా తమ జట్టు గెలవాలని పాకిస్తాన్ కొత్త కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ కోరుకుంటున్నాడు. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో పాటు, 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, 2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు కిర్‌స్టన్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. భారత్ 2011లో వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న కిర్‌స్టన్, బాబర్ ఆజం అతని బృందం ఈ మూడు టోర్నమెంట్‌లలో కనీసం ఒక్కటైనా గెలవాలని కోరుకుంటున్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ టీమ్ గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్న కిర్‌స్టన్ ఆదివారం పాకిస్థాన్ వన్డే, టీ20 ఇంటర్నేషనల్‌లకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. కిర్‌స్టన్ మే 22 నుండి పాకిస్తాన్.. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోచ్ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది.
పాక్ కోచ్ పదవీ కాలంలో లక్ష్యాల గురించి కిర్‌స్టెన్‌ని అడగగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) పోడ్‌కాస్ట్‌లో ఇలా అన్నాడు. పాక్ ఆ మూడు ICC టోర్నమెంట్‌లలో ఒకదానిని గెలవగలిగితే.. అది అద్భుతమైన విజయం. జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా చూడడమే నా పని అని అన్నాడు. జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లయితే.. ట్రోఫీని గెలుచుకోవడానికి మాకు ఎల్లప్పుడూ మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి జట్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో.. అగ్రస్థానంలో పోటీ పడేందుకు జట్లు ఎక్కడికి వెళ్లాలో అర్థం చేసుకోవడం నాకు చాలా ముఖ్యం.
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్‌లలో కొంతమందితో కలిసి పనిచేసే ఆఫర్ నాకు నచ్చింది. ఐపీఎల్‌లో బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉన్నందున జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు సిద్ధం కావడానికి తనకు సమయం తక్కువగా ఉందని కిర్‌స్టన్ అంగీకరించాడు. ప్రస్తుతం నేను ఒక బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. నేను ఇక్కడ నా ఒప్పందాన్ని పూర్తి చేయాలి. తాత్కాలిక ప్రధాన కోచ్‌గా అజహర్ మహమూద్ అద్భుతంగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. నేను జట్టును అర్థం చేసుకుంటున్నానని అన్నాడు.