హాంకాంగ్ పై పాక్ భారీ విజయం.. రేపు మరోసారి భారత్‌తో ఢీ
Pakistan Beat Hong Kong By 155 Runs.వారం రోజుల వ్యవధిలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 3 Sept 2022 11:03 AM ISTవారం రోజుల వ్యవధిలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. గ్రూప్ ఏలో తన తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ చివరి లీగ్ మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్ పై భారీ విజయాన్ని సాదించింది. తద్వారా గ్రూప్-ఏ నుంచి సూపర్-4కి అర్హత సాధించింది. సూపర్-4లో భాగంగా ఆదివారం భారత్‌తో పాకిస్తాన్ తలపడనుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(78 పరుగులు నాటౌట్; 57 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్), ఫఖర్ జమాన్(53; 41 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) లు రాణించగా.. ఆఖర్లో కుష్ దిల్ షా(35 పరుగులు నాటౌట్; 15 బంతుల్లో 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో పాక్ భారీ స్కోర్ సాధించింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి హాంకాంగ్ పాక్ బౌలర్ల ధాటికి చిగురుటాగులా వణికిపోయింది. 10.4 ఓవర్లలో 38 పరుగులకే కుప్పకూలింది. హాంకాంగ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ సాధించలేదు. ముగ్గురు బ్యాటర్లు డకౌట్ కాగా, కెప్టెన్ నిజాకత్ ఖాన్ చేసిన 8 పరుగులే అత్యధికం కావడం గమనార్హం.పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2.4 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ రిజ్వాన్ 3, నసీమ్ షా 2 వికెట్లు తీశారు. రిజ్వాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.
వాస్తవానికి భారత్‌తో మ్యాచ్‌లో హాంకాంగ్ అద్భుతంగా ఆడింది. చివరి వరకు విజయం కోయం ప్రయత్నించింది. అయితే.. పాక్‌తో మ్యాచ్‌లో హాంకాంగ్ పూర్తిగా చేతులెత్తేసింది.