Video : అదేం బాదుడు.. పాస్టెస్ట్ సెంచ‌రీతో హోబర్ట్ హరికేన్స్‌ను బిగ్ బాష్ ఛాంపియన్‌గా నిలిపిన మిచెల్ ఓవెన్

బిగ్ బాష్ లీగ్ 2024-25 ఫైనల్‌లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on  27 Jan 2025 5:54 PM IST
Video : అదేం బాదుడు.. పాస్టెస్ట్ సెంచ‌రీతో హోబర్ట్ హరికేన్స్‌ను బిగ్ బాష్ ఛాంపియన్‌గా నిలిపిన మిచెల్ ఓవెన్

బిగ్ బాష్ లీగ్ 2024-25 ఫైనల్‌లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్‌ను ఓడించింది. బెల్లెరివ్ ఓవల్‌లో జరిగిన ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మిచెల్ ఓవెన్ తుఫాను సెంచరీతో హోబర్ట్ హరికేన్స్ కేవలం 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. హోబర్ట్ హరికేన్స్ 14 ఏళ్ల తర్వాత తొలిసారి బిగ్ బాష్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది.

సిడ్నీ థండర్ అద్భుతంగా ఇన్నింగ్సు ప్రారంభించింది. జాసన్ సంఘా, కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు తొలి వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 11వ ఓవర్లో వార్నర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 32 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఆ తర్వాతి బంతికే మాథ్యూ గిల్క్స్ గోల్డెన్ డక్‌తో పెవిలియన్‌కు చేరుకున్నాడు. జట్టు స్కోరు 134 వద్ద మూడో వికెట్ ప‌డింది. వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ 14 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. 16వ ఓవర్‌లో జాసన్‌ సంఘా కూడా బెన్‌ చేతికి చిక్కాడు. సంఘా 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 19వ ఓవర్లో ఒలివర్ డేవిస్ క్యాచ్ ఔట్ అయ్యాడు. డేవిస్ 19 బంతుల్లో 26 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాతి బంతికే జార్జ్ గార్టెన్ గోల్డెన్ డక్‌ అయ్యాడు. చివరి బంతికి క్రిస్ గ్రీన్ రనౌట్ అయ్యాడు. గ్రీన్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. నాథన్ మెక్‌ఆండ్రూ 2 బంతుల్లో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

హోబర్ట్ హరికేన్స్ 183 పరుగుల లక్ష్యాన్ని 35 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ అద్భుత సెంచరీ చేశాడు. 39 బంతుల్లో సెంచరీ సాధించాడు. బీబీఎల్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఓవెన్ 42 బంతుల్లో 257.14 స్ట్రైక్ రేట్‌తో 108 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 6 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు.

మిచెల్ ఓవెన్‌తో పాటు కాలేబ్ జ్యువెల్ 12 బంతుల్లో 13 పరుగులు చేయగా, నిఖిల్ చౌదరి 1 పరుగు చేశాడు. బెన్ మెక్‌డెర్మాట్ 12 బంతుల్లో 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ 17 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్ బౌల‌ర్ల‌లో తన్వీర్ సంఘా 2 వికెట్లు తీశాడు. టామ్ ఆండ్రూస్ 1 వికెట్ తీశాడు.

Next Story