పదిహేను రోజులుగా ప్రపంచ క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టోక్యో ఒలింపిక్స్ ముగిశాయి. గత నెల 23న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. కరోనా సంక్షోభ సమయంలోనూ జపాన్ ప్రభుత్వం క్రీడలను ఎంతో ఘనంగా నిర్వహించింది. కట్టుదిట్టమైన బయో బబుల్ నిబంధనలు అమలు చేసి.. సజావుగా ఒలింపిక్స్ నిర్వహించి ప్రపంచం ప్రశంసలు అందుకుంటోంది. కాగా, విజయవంతమైన ఈ విశ్వ క్రీడలు టోక్యోలో కొద్దిసేపటి కింద ముగిసాయి.
ఇక టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో అగ్రరాజ్యం అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్యాలు సహా మొత్తం 113 పతకాలు సాధించి మొదటి స్థానంలో ఉంది. తర్వాత డ్రాగన్ చైనా 38 పసిడి పతకాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలు చేజిక్కించుకుని రెండోస్థానంలో నిలిచింది. ఇక, ఆతిథ్య జపాన్ 27 స్వర్ణాలతో మూడో స్థానంలో నిలవగా, ఆ తర్వాత బ్రిటన్ (22 స్వర్ణాలు), రష్యా (20 స్వర్ణాలు) టాప్-5లో నిలిచాయి. ఇక భారత్ కు పతకాల పట్టికలో 48వ స్థానం దక్కింది. భారత్ ఒకే ఒక స్వర్ణం సాధించగా, 2 రజతాలు, 4 కాంస్యాలు ఖాతాలో ఉన్నాయి.