మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు శనివారం తన మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 99 పరుగుల వద్ద బౌండరీ బాది తొలి టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ధృడమైన ఇన్నింగ్స్ ఆడి 171 బంతుల్లో మూడంకెల మార్కును చేరుకున్నాడు. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్‌తో కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరి భాగస్వామ్యం ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని కూడా భారీగా తగ్గించింది.
81 బంతుల్లో అర్ధ సెంచరీ పర్తి చేసుకున్న 21 ఏళ్ల నితీష్ రెడ్డి టీమ్‌ను ఫాలో ఆన్ గండం నుండి తప్పించాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత నితీష్ రెడ్డి.. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ స్టైల్ లో తన తొలి టెస్టు ఫిఫ్టీని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలావుంటే.. టీమిండియా తొలి ఇన్నింగ్సులో ప్రస్తుతం 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులతో పోరాడుతుంది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డి(105), సిరాజ్(2) పరుగులతో క్రీజులో ఉన్నారు.