ICC మహిళల అండర్-19 ప్రపంచ కప్‌లో పెను సంచలనం..!
ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేయడం ద్వారా నైజీరియా మహిళల అండర్-19 క్రికెట్ జట్టు చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకుంది.
By Medi Samrat Published on 20 Jan 2025 7:10 PM ISTఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేయడం ద్వారా నైజీరియా మహిళల అండర్-19 క్రికెట్ జట్టు చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నైజీరియా 2 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. సమోవాతో జరిగిన నైజీరియా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ 13 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
అయితే.. బ్యాటింగ్‌కు దిగిన నైజీరియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ విక్టరీ ఇగ్బినేడియన్ (1) వాకెలిన్ చేతిలో ఓ కానర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యింది. వెంటనే రెండో ఓపెనర్ పిక్యులర్ అగ్బోయా (3) రనౌట్ అయ్యింది. లిలియన్ ఉదేహ్ (18) ఒక ఎండ్‌లో 22 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ సాయంతో 18 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రిస్టాబెల్ చుక్వుయోయిన్ (4)ని టౌవేర్ క్లీన్ బౌల్డ్ చేసింది. కెప్టెన్ కలి పిటి(19) 25 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. మరోపక్క ఉదేహ్ లంబాట్ చేతిలో వాకెలిన్ క్యాచ్ ఔట్ అయ్యింది. PTని టాడ్ పెవిలియన్ పంపగా, అభిషిక్త అఖిగ్బేని ఫ్రాన్సిస్ ఔట్ చేసింది. నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున అనికా తౌవారే, హన్నా ఓ కానర్, అనికా టాడ్, తాష్ వాకెలిన్, హన్నా ఫ్రాన్సిస్‌లకు తలో వికెట్ దక్కింది.
66 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్ కేట్ ఇర్విన్ ఖాతా తెరవకుండానే రనౌట్ అయింది. వెంటనే పీస్ ఎమ్మా మెక్లియోడ్ (3)ని ఉదేహ్ క్యాచ్ అవుట్ చేసింది. ఆరంభంలోనే రెండు వికెట్లు పడిన తర్వాత ఈవ్ వోలండ్ (14), అనికా టాడ్ (19), కెప్టెన్ తాష్ వాకెలిన్ (18) ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో న్యూజిలాండ్ జట్టు లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చింది. అయితే సరిగ్గా ఆ సమయంలోనే నైజీరియా బౌలర్లు మ్యాచ్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి 9 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్ బాధ్యతను లిలియన్ ఉదే తీసుకుంది. మొదటి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు ఇచ్చి.. ఐదో బంతిని డాట్ బాల్ వేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చివరి బంతికి రెండు పరుగులు మాత్రమే చేశారు. దీంతో నైజీరియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో నైజీరియా జట్టు గ్రూప్-సీలో రెండోస్థానానికి చేరుకుంది. గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, సమోవా, న్యూజిలాండ్‌లు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికా రెండు విజయాలతో తొలి స్థానంలో ఉంది. నైజీరియా తర్వాతి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడనుంది. నైజీరియా ఈ విజయంతో టోర్నీలో పటిష్ట ప్రదర్శనను కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంది.