కొత్త ఫార్మాట్‌లో 2024 ప్ర‌పంచ‌క‌ప్‌

Next men’s T20 World Cup to be in played in new format.వెస్టిండీస్‌, యునైటెడ్ స్టేట్స్ 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కు అతిథ్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Nov 2022 9:50 AM GMT
కొత్త ఫార్మాట్‌లో 2024 ప్ర‌పంచ‌క‌ప్‌

వెస్టిండీస్‌, యునైటెడ్ స్టేట్స్ 2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కు అతిథ్యం ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌కు మ‌రో రెండు సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే క‌సర‌త్తు మొద‌లైంది. ఈ టోర్నీలో 20 టీమ్‌లు పాల్గొనున్నాయి. 2021, 2022 ప్ర‌పంచ‌క‌ప్‌ లో క్వాలిఫ‌య‌ర్ అనంత‌రం సూప‌ర్ 12 ద‌శ‌ను నిర్వ‌హించారు. అయితే.. ఇందుకు భిన్నంగా 2024 పొట్టి క‌ప్‌ను నిర్వ‌హించాల‌ని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) బావిస్తోంది. ఈ మేర‌కు కొత్త ఫార్మాట్ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

- 20 జ‌ట్లు పాల్గొన నుండ‌గా.. వీటిని ఐదు జ‌ట్ల చొప్పున నాలుగు గ్రూపులు విభ‌జించ‌నున్నారు. గ్రూపులోని ఒక్కొ జ‌ట్టు ఆ గ్రూపులో మిగిలిన జ‌ట్ల‌తో మ్యాచులు ఆడ‌నుంది. చివ‌రికి గ్రూప్‌లోని మొద‌టి, రెండు స్థానాల్లో నిలిచిన రెండు జ‌ట్ల చొప్పున మొత్తం 8 జ‌ట్లు సూప‌ర్-8 ద‌శ‌కు చేరుకుంటాయి.

సూప‌ర్-8 ద‌శ‌లో నాలుగు జ‌ట్ల చొప్పున రెండు గ్రూపులుగా విడిపోయి జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. రెండు గ్రూపుల్లో టాప్-2 స్థానాల్లో నిలిచిన నాలుగు జ‌ట్లు సెమీస్‌లో త‌ల‌ప‌డ‌తాయి. సెమీఫైన‌ల్‌లో విజేత‌ల‌తో ఫైన‌ల్‌ను నిర్వ‌హిస్తారు.

ఇప్ప‌టికే 12 జ‌ట్ల బెర్తులు ఖ‌రారు..

2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం ఇప్ప‌టికే 12 జ‌ట్లు త‌మ బెర్తుల‌ను ఖరారు చేసుకున్నాయి. అతిథ్య దేశాలు అయిన విండీస్‌, యూఎస్ఏ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇటీవ‌ల ఆసీస్‌లో నిర్వ‌హించిన ప్ర‌పంచ‌క‌ప్‌లో టాప్ 8 జ‌ట్లుగా నిలిచిన దేశాలు అర్హ‌త సాధించాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌లు స్థానం సంపాదించుకున్నాయి.

ఇక మిగిలిన 8 స్థానాల కోసం రీజిన‌ల్ క్వాలిఫికేష‌న్ ద్వారా జ‌ట్లను ఎంపిక చేయ‌నున్నారు.

Next Story