53 పరుగుల తేడాతో పరాజయం పాలైన ఆస్ట్రేలియా
Newzealand Beat Australia In 1st T20.ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మొదలైన 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.
By Medi Samrat
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు మూడో బంతికే డానియల్ సామ్స్ షాక్ ఇచ్చాడు. మార్టిక్ గప్టిల్ ను డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. ఇక మూడో ఓవర్లో టిమ్ సీఫర్ట్ ను జె.రిచర్డ్సన్ పెవిలియన్ చేర్చాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరడంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కివీస్. ఆ సమయంలో డెవాన్ కాన్వాయ్ అద్భుతంగా ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్, నీశమ్ లతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వరుసగా ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడడంతో కివీస్ మంచి స్కోరు చేయగలిగింది. 98 పరుగులతో ఆడుతున్న సమయంలో ఆఖరి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు డెవాన్ కాన్వాయ్.. దీంతో 99 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కివీస్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
అద్భుతమైన టీ20 ఆటగాళ్లు ఉన్న ఆసీస్ ఛేజింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫించ్, జాస్ ఫిలిప్, మ్యాక్స్ వెల్, స్టయినిస్ ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు పెవిలియన్ చేరారు. దీంతో రన్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. మిచెల్ మార్ష్ 45, ఆస్టన్ అగర్ 23 పరుగులతో రాణించారు. వీరిద్దరూ మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఆసీస్ ఓటమి పాలైంది. సోది నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. బౌల్ట్, సౌథీ చెరో రెండు వికెట్లు తీయగా.. మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశాడు. 17.3 ఓవర్ల వద్ద 131 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. కివీస్ 53 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ లో తర్వాతి మ్యాచ్ ఫిబ్రవరి 25న జరగనుంది.