క్లీన్‌స్వీప్ నుంచి బయటపడ్డ న్యూజిలాండ్..నాలుగో టీ20లో భారత్ ఓటమి

వరుసగా మూడు టీ20ల్లో గెలిచిన భారత జట్టుకి న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది.

By -  Knakam Karthik
Published on : 29 Jan 2026 8:40 AM IST

Sports news, Cricket, India vs New Zealand, Visakhapatnam T20, India T20 series

క్లీన్‌స్వీప్ నుంచి బయటపడ్డ న్యూజిలాండ్..నాలుగో టీ20లో భారత్ ఓటమి

వరుసగా మూడు టీ20ల్లో గెలిచిన భారత జట్టుకి న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ జట్టు క్లీన్ స్వీప్ నుంచి బయటపడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, డెవాన్ కాన్వే అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా సీఫెర్ట్ భారత పేసర్లపై విరుచుకుపడుతూ 36 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు. చివర్లో డారిల్ మిచెల్ (39 నాటౌట్) మెరుపులు తోడవడంతో న్యూజిలాండ్ 216 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. భారత బౌలర్లలో కుల్దీప్, అర్ష్‌దీప్ తలా రెండు వికెట్లు తీశారు.

నిలబెట్టిన దూబే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ డకౌట్ అవ్వగా, సూర్యకుమార్ యాదవ్ (8) నిరాశపరిచాడు. సంజూ శాంసన్ (24), రింకూ సింగ్ (39) కాసేపు పోరాడినా శాంట్నర్ ధాటికి పెవిలియన్ చేరారు. భారత్ 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో శివమ్ దూబే సిక్సర్ల వర్షం కురిపించాడు. ఇష్ సోధీ వేసిన ఒకే ఓవర్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 29 పరుగులు పిండుకున్న దూబే, టీ20ల్లో తన కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు.

దూబే జోరు చూస్తుంటే భారత్ గెలిచేలా కనిపించింది. కానీ, బౌలర్ చేతికి తగిలి బంతి వికెట్లను తాకడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న దూబే రనౌట్ అయ్యాడు. ఈ వికెట్‌తో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివరికి భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో సిరీస్‌లో న్యూజిలాండ్ తన ఖాతా తెరిచింది.

Next Story