ఈ మ్యాచ్ గెలవలేదంటే..?
New Zealand vs India 2nd t20 Today.కివీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 29 Jan 2023 2:37 PM ISTకివీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్ఇండియా టీ20 సిరీస్‌లో తడబడింది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిలవాలంటే నేడు జరిగే రెండో టీ20లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. మరీ భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తుందా..? లేక ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు సిరీస్ అప్పగిస్తుందా..? అన్నది చూడాల్సిందే. ఈ నేపథ్యంలో లఖ్‌నవూ స్టేడియంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.
టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం తరువాత సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు టీ20 జట్టుకు దూరంగా ఉంటుండగా వారి స్థానాల్లో యువ ఆటగాళ్లు అయిన ఇషాన్ కిషన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠిలు అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే.. ఈ యువ ఆటగాళ్లు ఏదో ఒక మ్యాచ్‌లో మెరుపులు మెరిపించడం తప్ప నిలకడగా ఆడలేకపోతున్నారు. ఈ ముగ్గురిలో త్రిపాఠికి తగినన్ని అవకాశాలు రాలేదు గానీ మిగిలిన ఇద్దరికి మాత్రం చాలానే వచ్చాయి.
బంగ్లాతో సిరీస్‌లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. ఆ మ్యాచ్ మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో చాలా సాధారణ ప్రదర్శన చేశాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 5,8,17 తొలి టీ20లో 4 పరుగులే చేశాడు. ఇక వన్డేల్లో రాణిస్తున్న శుభ్‌మన్ గిల్ పొట్టి ఫార్మాట్‌లో సత్తా చాటాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇషాన్, శుభ్‌మన్ శుభారంభం అందిస్తే మిగిలిన బ్యాటర్ల పని తేలిక అవుతుంది.
కివీస్‌తో వన్డేల్లో విఫలం అయిన సూర్యకుమార్ తొలి టీ20లో రాణించడం సానుకూలాంశం. అతడికి తోడు కెప్టెన్ హార్థిక్ పాండ్య కూడా రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు కుల్‌దీప్, వాషింగ్టన్ సుందర్ రాణిస్తుండగా, పేసర్ అర్షదీప్ దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఉమ్రాన్ మాలిక్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లను వీరు ఏ మాత్రం కట్టడి చేస్తారు అన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి పొట్టి ఫార్మాట్‌లో పగ తీర్చుకోవాలని కివీస్ చూస్తోంది. తొలి టీ20లో గెలిచిన ఉత్సాహాంలో ఉన్న న్యూజిలాండ్ రెండో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్లు కాన్వే, అలెన్‌తో పాటు ఆల్‌రౌండర్ మిచెల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు కూడా సమిష్టిగా రాణిస్తుండడం కివీస్‌కు కలిసివచ్చే అంశం.
ఇక లఖ్‌నవూ స్టేడియం బ్యాటింగ్‌కు ఎక్కువగా సహకరిస్తుందని అంచనా. మంచు ప్రభావం ఉండొచ్చు. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.