ఐర్లాండ్‌పై ఘన విజయం.. సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకున్న న్యూజిలాండ్
New Zealand strengthen T20 World Cup semi-finals spot after 35-run win over Ireland.సెమీస్‌కు చేరిన జట్టుగా న్యూజిలాండ్
By తోట వంశీ కుమార్ Published on 4 Nov 2022 2:01 PM ISTఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. గ్రూప్ దశలో మ్యాచ్‌లు ఆఖరి స్టేజ్‌కి చేరుకున్నా కూడా.. చివరి మ్యాచ్‌లు ఆడే వరకు ఆయా జట్లు సెమీస్‌కు చేరుతాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎట్టకేలకు సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలించింది. గ్రూప్-1లో ఉన్న కివీస్ సూపర్-12లో తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐదు మ్యాచులు ఆడిన న్యూజిలాండ్ 3 మ్యాచుల్లో విజయం సాధించగా ఓ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కివీస్ ఖాతాలో ప్రస్తుతం 7 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు తమ చివరి మ్యాచుల్లో విజయం సాధిస్తే 7 పాయింట్లు సాధిస్తాయి. అయినప్పటికీ మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా న్యూజిలాండ్ సెమీస్‌కు వెళ్లడం కాయం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లలో ఏ జట్టు రెండో సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటుందో చూడాలి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఫామ్ అందుకున్న కెప్టెన్ కేన్ విలియన్ సన్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. మిగిలిన వారిలో ఓపెనర్ అలెన్ 32, కాన్వే 28, మిచెల్ 31 పరుగులు చేశారు.
ఓ దశలో కివీస్ అలవోకగా 200 పరుగులు దాటేలా కనిపించింది. అయితే.. 19 ఓవర్‌లో జాషువా లిటిల్ వరుస బంతుల్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్ ల వికెట్లు పడగొట్టి కివీస్ భారీ స్కోర్ సాధించకుండా అడ్డుకున్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్ మూడు వికెట్లు పడగొట్టగా, గారెత్ డెలానీ రెండు, మార్క్ అడైర్ ఓ వికెట్ తీశారు.
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. లక్ష్య చేధనలో ఐరీష్ ఓపెనర్లు తొలి వికెట్‌కు స్టిర్లింగ్(37), బాల్బిరైన్(30)లు 61 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే..న్యూజిలాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లక్ష్యానికి చాలా దూరంలోనే ఐర్లాండ్ ఆగిపోయింది. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు వికెట్లు తీయగా సౌథీ, సాంటర్న్, సోధిలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.