ఎక్కడైతే కన్నీళ్లు పెట్టుకుందో.. అక్కడే సగర్వంగా..
New zealand has won world test championship.రెండేళ్ల క్రితం(2019).. ఇదే గడ్డపై వన్డే ప్రపంచ కప్ పైనల్‌లో
By తోట వంశీ కుమార్ Published on 24 Jun 2021 8:20 AM ISTరెండేళ్ల క్రితం(2019).. ఇదే గడ్డపై వన్డే ప్రపంచ కప్ పైనల్‌లో ఓటమి ఆ జట్టు ఆటగాళ్లనే కాక.. యావత్తు క్రీడాభిమానులను గుండె పగిలేలా చేసింది. ఎంతో చక్కటి ఆట తీరును కనబర్చినా.. అసంబద్ధ 'బౌండరీ కౌంట్' నిబంధనతో ఆ జట్టు కప్‌ను చేజార్చుకుంది. ఇప్పుడు అదే జట్టు మరో ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచి మధురానుభూతిని మిగుల్చుకుంది. ఆ జట్టే న్యూజిలాండ్. వరుణుడు ఆటంకాలు కలిగించినా.. రిజర్వ్ డే రోజున తనదైన ఆటతో.. డ్రా కాయమనుకున్న మ్యాచ్‌ను మలుపు తిప్పి విజయాన్ని సొంతం చేసుకుంది.
రెండేళ్ల డబ్ల్యూటీసీ ప్రయాణంలో భారత్‌కు సిరీస్ ఓటమిని రుచి చూపించిన ఏకైక జట్టు కివీస్ మాత్రమే. ఇప్పుడు అదే జట్టు పైనల్‌లో భారత్‌ను విశ్వవిజేత కాకుండా అడ్డుకుంది. 139 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. ప్రశాంతతకు మారు పేరైన ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్ సన్(89 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు),, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (100 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) పరిస్థితులకు తగ్గట్లుగా ఆడి.. మూడో వికెట్‌కు అభేధ్యంగా 96 పరుగులు జోడించి తమ జట్టుకు అధ్భుతమైన విజయాన్ని అందించారు. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తో పాటు గద (ట్రోఫీ) లభించింది. రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.
ఆదుకుంటారనుకుంటే..
32 పరుగుల ఆధిక్యంలో ఉండి.. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమ్ఇండియా మరో రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి డ్రాగా మ్యాచ్‌ను ముగిస్తుందని అంతా బావించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్లు పుజారా(15), కోహ్లీ(13) తీవ్రంగా నిరాశపరిచారు. వైస్ కెప్టెన్ రహానే(15) సైతం విఫలమయ్యాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (88 బంతుల్లో 41; 4 ఫోర్లు) ఒక్కడే కాసేపు పోరాడినా ఫలితం లేదు. చివరికి 170 పరుగుల వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ ఆధిక్యాన్ని తీసివేయగా.. ఆ జట్టు ముందు 139 పరుగుల సాధారణ లక్ష్యం నిలిచింది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ స్వల్ప వ్యవధిలో ప్రత్యర్థి రెండు వికెట్లు పడగొట్టి ఇబ్బందుల్లోకి నెట్టినా.. కెప్టెన్ కేన్ విలియమ్ సన్, సీనియర్ ఆటగాడు రాస్‌టేలర్ భారత బౌలర్లకు మరో అవకాశం ఇవ్వకుండా అభేద్యమైన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించి.. జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. కాగా.. కెప్టెన్ కేన్ విలియమ్ సన్ సారథ్యంలో న్యూజిలాండ్ జట్టు సాధించిన తొలి ఐసీసీ టైటిల్ ఇదే. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సారధ్యంలో ఇంత వరకు ఐసీసీ టైటిల్‌ను భారత్ అందుకోలేదు.
Kane Williamson and his champion side ✨#WTC21 Final | #INDvNZ pic.twitter.com/5aM6mZNxaj
— ICC (@ICC) June 23, 2021