మహిళల టి20 క్రికెట్‌లో సంచలనం నమోదైంది. నిన్నటి వరకూ పురుషుల (షాహిద్ అఫ్రిదీ, కోరే అండర్సన్) పేరు మీద వున్న రికార్డును సమం చేశారు. వివరాళ్లోకెళితే.. న్యూజిలాండ్ టీ20 టోర్నీలో వెల్లింగ్టన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సోఫీ డివైన్ (38 బంతుల్లో 108 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీతో అదరగొట్టింది.
కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి మహిళల టి20 క్రికెట్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇక ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌వుమెన్ డియోండ్ర డాటిన్ (38 బంతుల్లో దక్షిణాఫ్రికాపై 2010లో) పేరిట ఉండేది. సోఫీ డివైన్ తాజా ఇన్నింగ్సుతో ఆ రికార్డును బ్రేక్ చేసింది.
ఇదిలావుంటే.. ఒటాగోతో జరిగిన ఈ మ్యాచ్‌లో డివైన్ విజృంభణతో వెల్లింగ్టన్ జట్టు 10 వికెట్ల ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒటాగో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసింది. అనంతరం వెల్లింగ్టన్ జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 131 పరుగులు చేసి గెలుపొందింది. ఇక తాజా శతకంతో సోఫీ డివైన్ మహిళల టి20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (6) చేసిన వుమెన్ క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఆమె తర్వాత న్యూజిలాండ్ కే చెందిన సుజీ బేట్స్ (5), ఆస్ట్రేలియాకు చెందిన అలీసా హీలీ (5) రెండో స్థానంలో ఉన్నారు.