జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. ధావ‌న్ కాదు రాహుల్‌.. నెటీజ‌న్ల ఆగ్ర‌హం

Netizens angry as KL Rahul replaces Shikhar Dhawan as india captain for Zimbabwe tour.జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Aug 2022 11:15 AM IST
జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. ధావ‌న్ కాదు రాహుల్‌.. నెటీజ‌న్ల ఆగ్ర‌హం

జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా వ‌న్డే జ‌ట్టులో నాయ‌క‌త్వ మార్పు జ‌రిగింది. ఈ సిరీస్‌కు శిఖ‌ర్ ధావ‌న్‌ను కెప్టెన్‌గా నియ‌మించ‌గా ఇప్పుడు అత‌డి స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. నిజానికి కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో జింబాబ్వేతో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జ‌ట్టులో రాహుల్‌కు చోటు ద‌క్క‌లేదు. ఇప్పుడు రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో జ‌ట్టులోకి తిరిగివ‌చ్చాడు. ప్ర‌స్తుతం ప‌రిమిత ఓవ‌ర్ల వైస్ కెప్టెన్‌గా అత‌డు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు కాబ‌ట్టి అత‌డికే కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ సెల‌క్ట‌ర్లు నిర్ణ‌యం తీసుకున్నారు. రాహుల్ రాక‌తో ఆట‌గాళ్ల సంఖ్య 16 కి పెరిగింది. ఈ నెల 18, 20, 22 తేదీల్లో హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేల్లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, పంత్, శ్రేయ‌స్‌, బుమ్రా, ష‌మిల‌కు విశ్రాంతి ఇచ్చారు.

నెటీజ‌న్ల ఆగ్ర‌హాం..

సెల‌క్ట‌ర్ల తీరుపై నెటీజ‌న్లు, ధావ‌న్ అభిమానులు మండిప‌డుతున్నారు. ఇది ఒక విధంగా ధావ‌న్‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఒక వేళ రాహుల్‌ను ఈ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక చేయాల్సి వ‌స్తే బీసీసీఐ ముందే జ‌ట్టును ప్ర‌క‌టించ‌కుండా ఉండాల్సింద‌న్నారు. ఎలాగూ ధావ‌న్‌ను కెప్టెన్‌గా నియ‌మించారు కాబ‌ట్టి అత‌డినే అలాగే కొన‌సాగించాల్సి ఉందని కామెంట్లు పెడుతున్నారు.

Next Story