ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌ చరిత్రలో తొలి శ‌త‌కం బాదిన‌ ముంబై ఇండియన్స్ ప్లేయ‌ర్‌..!

ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌ నాట్ సివర్ బ్రంట్ ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో సోమవారం చరిత్ర సృష్టించింది.

By -  Medi Samrat
Published on : 27 Jan 2026 7:09 AM IST

ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌ చరిత్రలో తొలి శ‌త‌కం బాదిన‌ ముంబై ఇండియన్స్ ప్లేయ‌ర్‌..!

ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌ నాట్ సివర్ బ్రంట్ ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో సోమవారం చరిత్ర సృష్టించింది. వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన‌ మ్యాచ్‌లో బ్రంట్‌ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుతమైన సెంచరీ సాధించింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. బ్రంట్ 57 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో RCB పై 100 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడింది. ఇన్నింగ్సు ఆఖరి ఓవర్ నాలుగో బంతికి ఒక్క పరుగు తీసి సెంచరీ పూర్తి చేసి ఈ లీగ్‌లో అత్యుత్తమ స్కోర్ న‌మోదు చేసి రికార్డు సృష్టించింది.

అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా వోల్ పేరిట ఉంది. ఆమె యుపి వారియర్స్ తరపున ఆడుడూ లక్నోలో RCBపై 99 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్ గత సీజన్‌లో న‌మోదైంది.

బ్రంట్ సెంచరీతో ముంబై జట్టు బలమైన స్కోరు సాధించింది. ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేయగలిగింది. ఆమెతో పాటు ఓపెనర్ హేలీ మాథ్యూస్ 39 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 56 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం ఉంది. ముంబైకి విజయం అవసరం కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 15 పరుగుల తేడాతో ఓడించి తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బయలుదేరిన ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. జట్టులో సగం మంది 35 పరుగులకే డగౌట్‌కు చేరుకున్నారు. గ్రేస్ హారిస్ (15), కెప్టెన్ స్మృతి మంధాన (6), జార్జియా వోల్ (9), గౌతమి నాయక్ (1), రాధా యాదవ్ (0)లు త్వ‌ర‌త్వ‌ర‌గా ఔటయ్యారు. ఇక్కడి నుంచి రిచా ఘోష్ బాధ్యతలు తీసుకుంది. రిచా కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి జట్టు విజయంపై ఆశలు సజీవంగా నిలిపింది. రిచాతో పాటు నాడిన్ డి క్లర్క్ (28), అరుంధతి రెడ్డి (14), శ్రేయాంక పాటిల్ (12*) విలువైన సహకారాన్ని అందించారు. అయితే ముంబై బౌల‌ర్లు రాణించ‌డంతో ఆర్సీబీ విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే ఇన్నింగ్స్ చివరి బంతికి ఘోష్ అవుటయ్యింది. ముంబై ఇండియన్స్ తరఫున హేలీ మాథ్యూస్ గరిష్టంగా మూడు వికెట్లు పడగొట్టింది. షబ్నిమ్ ఇస్మాయిల్, అమేలియా కర్ రెండేసి వికెట్లు తీశారు. అమంజోత్ కౌర్ ఒక వికెట్‌ సాధించింది.

Next Story