విజయ్ హజారే ట్రోఫీలో చరిత్ర సృష్టించిన తమిళనాడు.. నారాయణ్ జగదీశన్ రికార్డుల మోత

Narayan Jagadeesan's 277 shatters world records in List A cricket. విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు జట్టు చరిత్ర సృష్టించింది.

By Medi Samrat  Published on  21 Nov 2022 4:14 PM IST
విజయ్ హజారే ట్రోఫీలో చరిత్ర సృష్టించిన తమిళనాడు.. నారాయణ్ జగదీశన్ రికార్డుల మోత

విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు జట్టు చరిత్ర సృష్టించింది. వన్డేల్లో 506 పరుగుల భారీ స్కోరు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. గ్రూప్Cలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు 50 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి..506 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ నారాయణ్ జగదీశన్ 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు చేశాడు. అతనికి సాయి సుదర్శన్ 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సులతో 154 పరుగులు చేసి సహకరించాడు. ఈ ఇద్దరు మొదటి వికెట్కు ఏకంగా 416 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

నారాయణ్ జగదీశన్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో నారాయణ్‌ డబుల్‌ సెంచరీ కొట్టడంతో ఈ టోర్నీలో అతడికి వరుసగా ఐదో సెంచరీ. జగదీశన్ ప్రపంచరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వరుసగా ఐదు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు 2014-15 సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఉంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగా జగదీశన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లీష్‌ క్రికెటర్‌ అలిస్టర్ బ్రౌన్(268) పేరిట ఉండేది. అదే విధంగా భారత్‌ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రోహిత్‌ శర్మ(264) రికార్డును జగదీశన్ బద్దలు కొట్టాడు.


Next Story