బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదైందని ఢాకా ట్రిబ్యూన్ నివేదిక వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలలో ఆగస్టు 7న గార్మెంట్ వర్కర్ ఎండీ రూబెల్ మరణించాడు. అతడి తండ్రి షకీబ్ అల్ హసన్ పై కేసు నమోదు చేశారు.
అడాబోర్‌లోని రింగ్ రోడ్‌లో జరిగిన ర్యాలీలో రుబెల్ కూడా ఉన్నాడు. అక్కడే అతని ఛాతీ, పొత్తికడుపుపై కాల్చినట్లు నివేదిక పేర్కొంది. ఈ సంఘటన తర్వాత అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అతను మరణించాడు. ఢాకాలోని అడాబోర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు, షకీబ్‌ను 28వ నిందితుడిగా పేర్కొనగా, ప్రముఖ బంగ్లాదేశ్ నటుడు ఫెర్దౌస్ అహ్మద్ 55వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనా, రోడ్డు రవాణా, వంతెనల శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ క్వాడర్ సహా 156 మంది నిందితులుగా ఉన్నట్లు సమాచారం.