ఎట్టకేలకు మెరిశాడు.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ పృథ్వీ షా..!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో విదర్భపై ముంబై తరఫున 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడడం ద్వారా పృథ్వీ షా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
By Medi Samrat Published on 11 Dec 2024 9:30 PM ISTసయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో విదర్భపై ముంబై తరఫున 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడడం ద్వారా పృథ్వీ షా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. డిసెంబర్ 11, బుధవారం బెంగళూరులోని ఆలూర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ముంబై 222 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. అజింక్య రహానే కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
మ్యాచ్ సమయంలో పృథ్వీ షా ప్రశాంతంగా కనిపించాడు. ఆ తర్వాత విదర్భ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కాసేపటికే నాలుగు సిక్సర్లు, ఐదు ఫోర్లు బాది పృథ్వీ షా ముంబైకి మంచి వేదికను సిద్ధం చేశాడు. పవర్‌ప్లేలో తుఫాను బ్యాటింగ్ చేసిన షా కేవలం ఒక్క పరుగు తేడాతో అర్ధ సెంచరీని కోల్పోయాడు. 26 బంతుల్లో 49 పరుగుల చేసిన పృథ్వీ షా.. ఏడో ఓవర్‌లో విదర్భ ఫాస్ట్ బౌలర్ దీపేష్ పర్వానీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
పృథ్వీ షా, అజింక్యా రహానే 42 బంతుల్లోనే 83 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా ముంబై విజయానికి పునాది వేశారు. ప్రస్తుతం జరుగుతున్న భారత దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ 40 పరుగుల మార్కును దాటడం ఇదే తొలిసారి. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌కు ముందు పృథ్వీ షా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 130 పరుగులు చేశాడు. 25 ఏళ్ల పృథ్వీని ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు తొందరగానే ఔటయ్యారు. అయితే రహానే 45 బంతుల్లో 3 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 9 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై 19.2 ఓవర్లలో 224 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. శివమ్ దూబే (37*), సూర్యాంశ్ షెడ్గే (36*) మంచి ఇన్నింగ్స్ ఆడారు.
ఇంతకు ముందు విదర్భ 221 పరుగులు చేసింది. అథర్వ తైడే 66 పరుగులతో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అపూర్వ వాంఖడే 51 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. కరుణ్ నాయర్ 26 పరుగులు చేశాడు. శుభ్‌మన్ దూబే 19 బంతుల్లో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై తరఫున అథర్వ అంకోల్కర్, సూర్యాంశ్ షెడ్గే తలా రెండు వికెట్లు తీశారు.