ముంబైకి మ‌రో ఓట‌మి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన లక్నో

ఐపీఎల్ 2024లో 48వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. లక్నో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

By Medi Samrat  Published on  1 May 2024 1:45 AM GMT
ముంబైకి మ‌రో ఓట‌మి.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరిన లక్నో

ఐపీఎల్ 2024లో 48వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. లక్నో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో ముంబై ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జ‌వాబుగా లక్నో నాలుగు వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో నాలుగు వికెట్ల తేడాతో ముంబైని ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. దీంతో లక్నో సూపర్ జెయింట్ జట్టు ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. అదే సమయంలో చెన్నై నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక ముంబై ఆరు పాయింట్లు నెట్ రన్ రేట్ -0.272తో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో MIకి ఇది ఏడో ఓటమి.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అనంతరం లక్నో 19.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో లక్నో త‌రుపున‌ బ్యాటింగ్ ప్రారంభించేందుకు వచ్చిన అర్షిన్ కులకర్ణి ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. అతడిని నువాన్ తుషార ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీని తర్వాత మార్కస్ స్టోయినిస్, కేఎల్ రాహుల్ బాధ్యతగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఆ త‌ర్వాత‌ ఎనిమిదో ఓవర్‌లో మహ్మద్‌ నబీ వేసిన బంతికి కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ అవుట‌య్యాడు. అత‌డు మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 28 పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత స్టోయినిస్, దీపక్ హుడా మూడవ వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యం నెల‌కొల్పారు, స్కోరు 99 పరుగుల వద్ద ఉన్న‌ప్పుడు దీపక్ హుడా(18) కూడా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ అద్భుత ప్రదర్శన చేశాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో అతని బ్యాట్ నుంచి ఇది రెండో అర్ధ‌ సెంచరీ. ఈ మ్యాచ్‌లో ఈత‌డు 45 బంతుల్లో 62 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. లక్నో తరఫున ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్ పురాన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కృనాల్ పాండ్యాతో కలిసి 10 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్‌లో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే జట్టు విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, తుషార, కోయెట్జీ, నబీ తలో వికెట్ తీశారు. అంత‌కుముందు ముంబై బ్యాట్స్‌మెన్‌ల‌లో ఇషాన్ కిష‌న్‌(32), నెహాల్ వ‌ధేరా(46), టిమ్ డేవిడ్‌(35) లు త‌ప్ప మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ క్రీజులో నిల‌వ‌లేదు.

Next Story