అసలే ఓటమి.. రోహిత్ శర్మకు ఇంకో షాక్
Mumbai Indians Skipper Rohit Sharma Fined Rs. 12 Lakh. ముంబయి ఇండియన్స్ జట్టును బ్రాబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది.
By Medi Samrat Published on 28 March 2022 5:34 AM GMTముంబయి ఇండియన్స్ జట్టును బ్రాబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. ఢిల్లీని లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గెలిపించారు. 4 వికెట్ల తేడాతో ముంబయి జట్టుని ఢిల్లీ ఓడించింది. ముంబయి ఇచ్చిన 178 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, లలిత్ యాదవ్ (48 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 22), అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్) రాణించడంతో ఢిల్లీ గెలిచింది. అక్షర్ పటేల్ ఆఖర్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగడంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ విజయం సాధించింది. ముంబయి బౌలర్ డానియల్ సామ్స్ వేసిన 18వ ఓవర్లో ఢిల్లీ జట్టు 24 పరుగులు సాధించింది.
అంతకుముందు ముంబయి జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. టాస్ ఓడిన ముంబయి బ్యాటింగ్ కు దిగగా ఓపెనర్ ఇషాన్ కిషన్ మొత్తం 48 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేశాడు. అన్మోల్ ప్రీత్ సింగ్ 8, తిలక్ వర్మ 22, కీరన్ పొలార్డ్ 3, టిమ్ డేవిడ్ 12 పరుగులు చేశారు. డేనియల్ శామ్స్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.
ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ముంబై నిర్దిష్ట సమయంలో తన బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోవడంతో ఈ జరిమానా విధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయలేకపోవడమే తమ ఓటమికి కారణమన్నాడు.