ఆరంభం అదిరింది.. తొలి మ్యాచ్‌లో ముంబై ఘన విజయం
హర్మన్ ప్రీత్ సేన బెత్ మూనీ కెప్టెన్సీలోని గుజరాత్ జెయింట్స్‌ను 154 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది
By తోట వంశీ కుమార్ Published on 5 March 2023 11:29 AM ISTవికెట్ తీసిన ఆనందంలో ముంబై ప్లేయర్లు
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) కు అదిరిపోయే ఆరంభం ఇది. హీలీ మాథ్యూస్, అమెలియా కెర్ మెరుపులకు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి ఇన్నింగ్స్ తోడవడంతో ముంబై జట్టు అలవోకగా రెండు వందల పై చిలుకు స్కోర్ చేసింది. కొండంత లక్ష్య చేధనలో గుజరాత్ కనీస పోరాటం కరువైంది. అచ్చం ఐపీఎల్ ఆరంభపోరు తరహానే డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ సాగింది.
ఎన్నాళ్ల నుంచో ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. బాణా సంచా మోతలతో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌లో బ్యాటర్లు దుమ్మురేపారు. శనివారం డివై పాటిల్ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సేన బెత్ మూనీ కెప్టెన్సీలోని గుజరాత్ జెయింట్స్‌ను 154 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ( 65; 30 బంతుల్లో 14 ఫోర్లు) తుఫాన్ ఇన్సింగ్ ఆడగా హెలీ మాథ్యూస్( 47; 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అమెలియా కేర్( 45 నాటౌట్; 24 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ ) దంచికొట్టడంతో నిర్ణీత ఓవర్లో ముంబై భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు పడగొట్టగా వారెహమ్, తనూజ కాన్వర్, అష్లే గార్డనర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. దయాలన్ హేమలత (29 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. కెప్టెన్ మూనీ (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం గుజరాత్‌కు దెబ్బకొట్టింది. ముంబై బౌలర్లలో సైకా 4 వికెట్లు తీయగా, బ్రంట్, అమేలియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.