ఉత్కంఠ పోరులో ముంబై విజయం
Mumbai Indians beat Gujarat Titans by 5 runs.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌లో భాగంగా శుక్రవారం
By తోట వంశీ కుమార్ Published on 7 May 2022 8:07 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇప్పటికే దూరమైన ముంబై వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు చేరుకున్న తొలి జట్టుగా నిలవాలనుకున్న గుజరాత్‌కు గట్టి షాక్ తగిలింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై కు ఓపెనర్లు ఇషాన్ కిషన్ ( 45; 29 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్), రోహిత్‌శర్మ( 43; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఈ సీజన్‌లో తొలి సారి రోహిత్ బౌలర్లపై పూర్తి ఆధపత్యాన్ని ప్రదర్శిస్తూ భారీ షాట్లతో అలరించాడు. ఇటు ఇషాన్ కిషన్ కూడా బారీ షాట్లు ఆడడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. రోహిత్‌ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించడంతో 73 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమంగా తప్పకుండా వికెట్లు తీయడంతో ముంబై 15 ఓవర్లకు 120/4తో నిలిచింది. సూర్యకుమార్(13), పొలార్డ్(4) విఫలం అయ్యారు. ఆఖల్లో తిలక్ వర్మ(21), టిమ్ డేవిడ్(44 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 177/6 స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ఖాన్ రెండు వికెట్లు తీయగా, జోసెఫ్, ఫెర్గుసన్, సాంగ్వాన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 172/5 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్లు సాహా(55; 40 బంతుల్లో 6 పోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్(52; 36బంతుల్లో 6పోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు ముంబై బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ పరుగల వరద పారించారు. వీరిద్దరి జోరు చూస్తుంటే.. గుజరాత్ ఖాతాలో మరో విజయం చేరినట్లే అనిపించింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఖానీ ముంబైకి తొలి వికెట్ దక్కలేదు.
మురుగన్ అశ్విన్ ఓకే ఓవర్‌లో తొలి, ఆఖరి బంతులకు ఓపెనర్లు ఇద్దరిని ఔట్ చేశాడు. అప్పటికి గుజరాత్ స్కోర్ 111/2. అయినా గుజరాత్‌కు చేధన కష్టం కాదనే అనుకున్నారంతా. అయితే.. ముంబై బౌలర్లు ఈ దశలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హార్థిక్ పాండ్య(24), సాయి సుదర్శన్(14), తెవాటియా(3) లు వెంటవెంటనే పెవిలియన్ కు చేరుకున్నారు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. క్రీజులో మిల్లర్(19 నాటౌట్; 14 బంతుల్లో 1పోర్, 1సిక్స్) ఉండడంతో గుజరాత్ గెలుపుపై ఎవ్వరికి అనుమానాలు లేవు. అయితే.. అద్భుతంగా బౌలింగ్ చేసిన సామ్ కేవలం 3 పరుగులే ఇచ్చి.. ముంబైకి విజయాన్ని అందించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో రాణించిన డేవిడ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.