హ్యాట్రిక్‌తో విండీస్‌కు చుక్క‌లు చూపించిన బౌల‌ర్‌..!

ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 24 ఏళ్ల ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డుల‌లోకి ఎక్కాడు.

By -  Medi Samrat
Published on : 22 Jan 2026 11:30 AM IST

హ్యాట్రిక్‌తో విండీస్‌కు చుక్క‌లు చూపించిన బౌల‌ర్‌..!

ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 24 ఏళ్ల ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డుల‌లోకి ఎక్కాడు. రెహమాన్ హ్యాట్రిక్‌తో ఆఫ్ఘనిస్థాన్ విండీస్‌పై వరుసగా రెండో విజయాన్ని న‌మోదు చేసింది.

రెండవ T20I మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 39 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తిరుగులేని 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ తన T20 కెరీర్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించి ప్రత్యేక క్లబ్‌లోకి ప్రవేశించాడు. ముజీబ్‌ ఉర్‌ రెహమాన్ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తన మూడో ఓవర్ తొలి బంతికి హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

8వ ఓవర్‌లో ఎవిన్ లూయిస్ అవుట్ చేసిన రెహ‌మాన్‌.. తర్వాతి బంతికి జాన్సన్ చార్లెస్ వికెట్‌ను తీశాడు. దీని తర్వాత కెప్టెన్ అతనికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఆ త‌ర్వాత‌ 16వ ఓవర్ తొలి బంతికి బ్రాండన్ కింగ్‌ను అవుట్ చేయడం ద్వారా రెహ‌మాన్‌ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఈ విధంగా ముజీబ్ ఉర్ రెహమాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి T20 ఇంటర్నేషనల్‌లో హ్యాట్రిక్ సాధించిన మూడవ ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు రషీద్ ఖాన్, కరీం జనత్ ఈ ఘనత సాధించారు.

రెండో టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ దర్విష్ అబ్దుల్ రసూలీ, సెడిఖుల్లా అటల్ అద్భుత అర్ధ సెంచరీలు చేసి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. రసూలీ 39 బంతుల్లో 68 పరుగులు చేయగా, సెడిఖుల్లా అటల్ 53 పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

దీనికి సమాధానంగా లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన వెస్టిండీస్ జట్టుకు ఆరంభంలోనే ఆఫ్ఘన్ బౌలర్లు భారీ షాకులు ఇచ్చారు. తొలుత ఫాస్ట్ బౌలర్లు వికెట్లు పడగొట్టినా.. అసలు కథ రాసింది స్పిన్నర్లు. ముజీబ్-ఉర్-రహ్మాన్ తన ఖచ్చితమైన లైన్-లెంగ్త్ తో బౌలింగ్ చేసి కరేబియన్ బ్యాట్స్‌మెన్‌లను పూర్తిగా గందరగోళానికి గురిచేశాడు.

వెస్టిండీస్ జట్టు 18.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ 50 పరుగులు, షిమ్రాన్ హెట్మెయర్ 17 బంతుల్లో 46 పరుగులు చేసినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.

Next Story