ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వినిపించింది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని వదిలేయడం, ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా పగ్గాలు అందుకోవడం జరిగాయి. కానీ సగం టోర్నీ ముగిసేసరికి చెన్నై జట్టు ఘోరమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో దిగువన నిలిచింది. దాంతో కెప్టెన్సీ తన వల్లకాదంటూ జడేజా వైదొలగడం, ధోనీ మళ్లీ చెన్నై కెప్టెన్ గా నియమితుదవడం తెలిసిందే. అయితే ధోని తన మీద వచ్చిన రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు. వచ్చే సీజన్ లో కూడా ఆడతానని, 2023లోనూ తనను చెన్నై సూపర్ కింగ్స్ పసుపు జెర్సీలోనే చూస్తారని వెల్లడించాడు. టోర్నీలో ప్రస్తుతం చెన్నై జట్టు ఆడుతున్న తీరును సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ వయసులోనూ ధోనీ దుమ్మురేపుతున్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్ గా సేవలు అందిస్తున్నాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ సమయంలో మైదానంలోకి వచ్చి మరీ ధోనీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. స్టెయిన్ పట్టుకు వచ్చిన జెర్సీని ధోనీ పరిశీలనగా చూస్తూ దానిపై తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇలా పలువురు దేశ-విదేశ ఆటగాళ్లు ధోని అంటే అభిమానం చూపిస్తూ ఉన్నారు.