సిరాజ్ భావోద్వేగపు పోస్ట్.. 'నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్ కింగ్ కోహ్లీవే'
Mohammed Siraj Pens Emotional Note For Virat Kohli.దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ పరాజయం తరువాత విరాట్ కోహ్లి
By తోట వంశీ కుమార్ Published on 18 Jan 2022 2:18 PM ISTదక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ పరాజయం తరువాత విరాట్ కోహ్లి సుదీర్ఘ ఫార్మెట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇకపై ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు కోహ్లీతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పేసర్ సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లితో దిగిన ఫొటోలను షేర్ చేసుకుంటూ భావోద్వేగభరిమైన పోస్ట్ చేశాడు. కోహ్లీనే తనకు ఎల్లప్పుడూ కెప్టెన్ అని.. తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు అని చెప్పాడు.
''నా సూపర్ హీరో.. నాకు మద్దతుగా నిలిచినందుకు, నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించినందుకు మాత్రమే నీకు రుణపడి ఉంటానని చెబితే సరిపోదు. నువ్వే ఎల్లప్పుడూ నాకు పెద్దన్నవు. ఇన్నేళ్లు నాపై ఇంత విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. నేను చెత్త ప్రదర్శన చేసిన ప్రతిసారి కూడా నాలోని గొప్ప ఆటగాడిని చూసినందుకు కృతజ్ఞతలు. నువ్వు ఎల్లప్పుడూ నాకు కెప్టెన్ కింగ్ కోహ్లీ వే' అంటూ సిరాజ్ ఇన్ స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో రాసుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే మహమ్మద్ సిరాజ్ వన్డే, టీ20 క్రికెట్‌లో అరగ్రేటం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కూడా విరాట్ నాయకత్వంలోనే సిరాజ్ ఆడాడు. చెత్త ప్రదర్శనలు చేసినప్పటికి సిరాజ్‌కు విరాట్ అండగా నిలిచాడు. కొత్త బంతితో స్వింగ్ చేయగల సిరాజ్ సామర్థ్యాన్ని గుర్తించిన కోహ్లీ పలు అవకాశాలు ఇచ్చాడు. దీంతో తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నాడు సిరాజ్.
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాలో రెండో టెస్టులో గాయపడిన సిరాజ్ మూడో టెస్టు మ్యాచ్ కు దూరం అయ్యాడు. ఇక రేపు(బుధవారం) సౌతాఫ్రికాతో జరగనున్న తొలి వన్డేలో సిరాజ్ ఆడతాడో లేదో అన్నది ఇంకా తెలియరాలేదు.