అవకాశం ఇస్తే ఏదైనా చేయగలను.. లేక‌పోతే నీళ్లు అందిస్తాను.. ద్రావిడ్‌, రోహిత్‌ల‌పై ష‌మీ కామెంట్స్‌

గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు.

By Medi Samrat  Published on  3 Sept 2024 3:12 PM IST
అవకాశం ఇస్తే ఏదైనా చేయగలను.. లేక‌పోతే నీళ్లు అందిస్తాను.. ద్రావిడ్‌, రోహిత్‌ల‌పై ష‌మీ కామెంట్స్‌

గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రపంచకప్‌లో షమీ కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. షమీ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌ల‌కు ఎంపిక కాలేదు. ఈ విషయంలో షమీ ఇప్పుడు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లను టార్గెట్ చేశాడు. అయితే ఇదంతా షమీ సరదాగా చెప్పాడు. వన్డే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ల్లో షమీ కంటే హార్దిక్‌ పాండ్యాకే టీమ్ మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యత ఇచ్చింది. నాలుగు మ్యాచ్‌ల తర్వాత పాండ్యా గాయపడటంతో జట్టు షమీకి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత షమీ విధ్వంసం సృష్టించాడు.

వరల్డ్ కప్ ప్రయాణం గురించి షమీ మాట్లాడిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఇటీవల విడుదల చేసింది. షమీ మాట్లాడుతూ.. తన వరల్డ్ కప్ కెరీర్ కూడా మొదట్లో ప్లేయింగ్-11లో చోటు ద‌క్క‌కుండానే సాగిందని.. ఆ తర్వాత తనని జ‌ట్టులో చేర్చుకున్నాక‌ తన బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాన‌ని చెప్పాడు. అవ‌కాశాలు ద‌క్క‌క‌పోవ‌డం వ‌ల్ల‌ నేను అలవాటు పడ్డాను. కెప్టెన్, కోచ్ నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మంచి ప్రదర్శన ఇచ్చాను. ఇతనిని మళ్లీ కూర్చోబెట్టుదాం అని ఈ వ్యక్తులు ఎప్పుడైనా అనుకున్నారా..? అని స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. కష్టపడి పనిచేయగలడు అని న‌మ్మారు అని అన్నాడు. నాకు అవకాశం వచ్చేలా చేసుకోవడానికి నేను ప్ర‌య‌త్నిస్తుంటాను. ఎందుకంటే వాళ్లు నాకు అవకాశం ఇస్తే.. నేను ఏదైనా చేయగలను. లేకపోతే.. టేబుల్‌పై కూర్చొని నీళ్లు అందిస్తాను. నాకు అవకాశం వచ్చినప్పుడు మంచి జ‌రిగింది. మీకు అవకాశం వస్తే.. దానిని మీ చేతుల్లోకి తీసుకోండని వ్యాఖ్యానించాడు.


ప్రపంచకప్‌లో గాయపడిన షమీ అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. షమీ గాయం నుంచి కోలుకునేందుకు కసరత్తు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం NCAలో పున‌రావాసంలో ఉన్న ఆయ‌న‌.. ఈ నెలలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు తిరిగి జట్టులోకి రావచ్చని అంతా భావిస్తున్నారు.

Next Story