పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన షమీ, సిరాజ్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం 26 మంది పర్యాటకులు మరణించగా, అనేక మంది గాయపడిన ఉగ్రవాద దాడిని అనేక మంది భారతీయ క్రీడాకారులు ఖండించారు.

By Medi Samrat
Published on : 23 April 2025 2:15 PM IST

పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన షమీ, సిరాజ్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం 26 మంది పర్యాటకులు మరణించగా, అనేక మంది గాయపడిన ఉగ్రవాద దాడిని అనేక మంది భారతీయ క్రీడాకారులు ఖండించారు. ఆ లిస్టులో భారత జట్టు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ కూడా ఉన్నారు.

'ఆల్ ఐస్ ఆన్ పహల్గామ్' అని రాసిన చిత్రాన్ని షమీ ఎక్స్ లో షేర్ చేశాడు. "పహల్గామ్‌లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఈ హేయమైన చర్య కారణంగా అమాయకుల ప్రాణాలు పోయాయి. ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేశాయి. ఇటువంటి హింస మన సమాజ నిర్మాణాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ పరీక్షా సమయాల్లో, ఉగ్రవాదాన్ని ఖండించడంలో మనం ఐక్యంగా నిలబడాలి. బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను" అని షమీ అన్నారు.

స్టార్ ఇండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈ దారుణాన్ని ఖండించారు. ఈ ఉగ్రవాద దాడిని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదులకు శిక్ష పడాలని అన్నారు. మతం పేరుతో అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని చంపడం దుర్మార్గమన్నారు సిరాజ్. ఏ మతం, ఏ నమ్మకం, ఏ భావజాలం ఇలాంటి క్రూరమైన చర్యను ఎప్పుడూ సమర్థించలేవని సిరాజ్ రాశారు. మనిషి జీవితానికి విలువ లేని ఈ యుద్ధం ఏమిటని సిరాజ్ ప్రశ్నించారు. బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, గాయాన్ని నేను ఊహించలేకపోతున్నాను. ఈ భరించలేని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని కుటుంబాలు పొందాలని సిరాజ్ అన్నారు.

Next Story