ఐసీయూలో చికిత్స పొంది.. మ్యాచ్ ఆడేందుకు వ‌చ్చిన పాక్ క్రికెట‌ర్‌

Mohammad Rizwan spent two nights in ICU before semi-final.దేశానికి ప్రాతినిథ్యం వ‌హించ‌డం క్రికెట్ ఆడే ప్ర‌తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2021 10:09 AM IST
ఐసీయూలో చికిత్స పొంది.. మ్యాచ్ ఆడేందుకు వ‌చ్చిన పాక్ క్రికెట‌ర్‌

దేశానికి ప్రాతినిథ్యం వ‌హించ‌డం క్రికెట్ ఆడే ప్ర‌తి ఒక్క‌రి క‌ల. అయితే.. అంద‌రికి ఆ అవ‌కాశం దొర‌క‌దు. కొంద‌రికి మాత్ర‌మే ఆ అవ‌కాశం ద‌క్కుకుతుంది. త‌మ‌కు ద‌క్కిన అవ‌కాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. కొద్ది మంది మాత్ర‌మే.. దేశం కోసం ఏమైనా చేయ‌డానికి సిద్ద‌ప‌డుతుంటారు. మైదానంలో గాయ‌ప‌డిన‌ప్ప‌టికి దేశ కోసం నొప్పిని పంటి బిగువున ప‌ట్టి పోరాడిన వారిని చూశాం. తాజాగా పాక్ క్రికెటర్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ త‌న దేశ భ‌క్త‌ని చూపించాడు.మ్యాచ్‌కు రెండు రోజుల ముందు వ‌ర‌కు ఐసీయూలో చికిత్స పొందిన రిజ్వాన్.. విశాంత్రి తీసుకోవాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ సూచించిన‌ప్ప‌టికి కీల‌క‌మైన సెమీస్ మ్యాచ్ ఆడేందుకే మొగ్గుచూపాడు.

సెమీస్ మ్యాచ్‌కి రెండురోజుల‌ ముందు రిజ్వాన్ ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరాడు. ఐసీయూలో రెండు రాత్రులు చికిత్స పొందాడు. మ్యాచ్‌కు ముందు రోజు కాస్త కోలుకున్నాడు. ఆరోగ్య ప‌రిస్థితి పూర్తిగా మెరుగుప‌డ‌క‌పోవ‌డంతో విశ్రాంతి తీసుకోవాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ సూచించ‌గా.. కీల‌క మ్యాచ్ కాబ‌ట్టి ఎట్టిప‌రిస్థితుల్లో మ్యాచ్ ఆడుతాన‌ని ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించ‌డంతో ఆడేందుకు అనుమ‌తి ఇచ్చారు.

ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ మాజీ క్రికెట‌ర్ షోయ‌బ్ అక్త‌ర్‌ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. రిజ్వాన్ మ్యాచ్ కు ముందు రెండ్రోజులు ఐసీయూలో చికిత్స పొందాడి వెల్ల‌డించాడు. ఈ విష‌యం తెలిసిన ప‌లువురు రిజ్వాన్ డెడికేష‌న్ చూసి ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ 67 ప‌రుగుల‌తో రాణించ‌డంతో పాటు వికెట్ కీప‌ర్‌గానూ స‌మ‌ర్థ‌వంతంగా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్‌ రిజ్వాన్‌ (52 బంతుల్లో 67; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫఖర్‌ జమన్‌ (32 బంతుల్లో 55 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (39; 5 ఫోర్లు) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ రెండు ప‌డ‌గొట్ట‌గా.. కమిన్స్‌, జంపా చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (30 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభంలో మెరుపులు మెరిపిస్తే.. మార్కస్‌ స్టొయినిస్‌ (31 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ వేడ్‌ (17 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి మ‌రో ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే ఆసీస్‌కు విజ‌యాన్ని అందించారు. ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియాకిది ఐదో విజయం. ఇక ఆదివారం జ‌రిగే ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ను ఆస్ట్రేలియా ఢీ కొట్ట‌నుంది.

Next Story