పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 2021 సంవత్సరానికి ICC పురుషుల T20I క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్ అయిన రిజ్వాన్ ఈ అవార్డును కైవసం చేసుకోవడానికి ఇంగ్లాండ్‌కు చెందిన జోస్ బట్లర్, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా, ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కొన్నాడు. తనకు ఈ ఫార్మాట్‌లో 2021 అసాధారణమైన సంవత్సరం అని.. ICC పురుషుల T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నన్ను ఎన్నుకున్న వారికి, సహచరులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవార్డు నన్ను మరింత మెరుగ్గా రాణించడానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.
రిజ్వాన్ 2021లో కేవలం 29 మ్యాచ్‌ల్లో 1326 పరుగులు చేశాడు. అతడి సగటు 73.66 కాగా.. స్ట్రైక్ రేట్ 134.89 గా ఉంది. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2021 సందర్భంగా సెమీఫైనల్‌కు పాకిస్తాన్ చేరడంతో అతడు కీలక పాత్ర పోషించాడు. 2021 సంవత్సరం ప్రారంభంలో లాహోర్‌లో దక్షిణాఫ్రికాపై తన కెరీర్‌లో తొలి T20I సెంచరీని సాధించాడు. కరాచీలో వెస్టిండీస్‌పై 87 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ తో తన ఫామ్‌ను కొనసాగించాడు. అక్టోబర్ 24న దుబాయ్‌లో భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన జరిగింది. 152 పరుగుల ఛేదనలో రిజ్వాన్ కేవలం 55 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలింగ్ దాడిని అతను సులువుగా ఎదుర్కొనడం అందర్నీ ఆకట్టుకుంది.