పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌కు నివాళి అర్పించిన మహ్మద్ హఫీజ్.. ఎందుకంటే..

2023 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్‌కు సంబంధించి రోజుకో ఆసక్తికర వార్త వెలువడుతూనేవుంది

By Medi Samrat  Published on  10 April 2024 4:29 PM IST
పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌కు నివాళి అర్పించిన మహ్మద్ హఫీజ్.. ఎందుకంటే..

2023 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్‌కు సంబంధించి రోజుకో ఆసక్తికర వార్త వెలువడుతూనేవుంది. మంగళవారం న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ప్రకటించిన టీ20 జట్టులో మహ్మద్ అమీర్ ఎంపికైన తర్వాత మాజీ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ పీసీబీపై విరుచుకుపడ్డాడు.

పాకిస్థాన్ జట్టు మాజీ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ సోషల్ మీడియాలో పీబీసీపై విమర్శలు చేశారు. అతను తన X హ్యాండిల్‌లో 'పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్‌కు నివాళి' అని రాశాడు. జట్టును ప్రకటించిన అనంతరం ఆయన ఈ పోస్ట్ చేశారు. మహ్మద్ అమీర్ తిరిగి రావడాన్ని అత‌డు తీవ్రంగా విమర్శించాడు.

నిజానికి స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిషేధం ఎదుర్కొన్న మహమ్మద్ అమీర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు. అలాగే టీ20 ప్రపంచకప్‌ ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మంగళవారం ప్రకటించిన జట్టులో అమీర్‌తో పాటు స్పిన్నర్ ఇమాద్ వసీమ్ కూడా చోటు దక్కించుకున్నాడు.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై దోషిగా తేలిన త‌ర్వాత కొంత‌కాలం జైలు శిక్ష అనంత‌రం అమీర్ చివరిసారిగా 2020లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మాజీ కోచ్‌లు మిస్బా-ఉల్-హక్, వకార్ యూనిస్‌లతో విభేదాల కారణంగా అతను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.

ఇక స్పిన్ ఆల్-రౌండర్ ఇమాద్ వ‌సీమ్‌ నవంబర్ 2023లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో త‌న‌ జట్టు టైటిల్ గెలుచుకున్న తర్వాత బోర్డు, సెలెక్టర్లు ఒప్పించడంతో అతను తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు. బాబర్ అజామ్ సారథ్యంలో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

Next Story