అజారుద్దీన్.. అసలు ఊహించని ఘటన

Mohammad Azharuddin removed as Hyderabad Cricket Association president. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)లో చక్రం తిప్పాలని

By Medi Samrat  Published on  17 Jun 2021 8:26 AM GMT
అజారుద్దీన్.. అసలు ఊహించని ఘటన

హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)లో చక్రం తిప్పాలని అనుకున్న హెచ్ సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ కు ఊహించని షాక్ తగిలింది. హెచ్ సీఏ ప్రెసిడెంట్ అయిన అజారుద్దీన్ పైనే వేటు పడింది. మహ్మద్ అజారుద్దీన్ పై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంతో అపెక్స్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ సీఏలో మహ్మద్ అజారుద్దీన్ సభ్యత్వాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసింది. మహ్మద్ అజారుద్దీన్ హెచ్ సీఏ అధ్యక్ష పదవిలోకి వచ్చినప్పటి నుంచే విభేదాలు కొనసాగాయి. ఏప్రిల్ లో జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో కూడా అజర్, హెచ్ సీఏ కార్యదర్శి విజయానంద్ స్టేజిపైనే గొడవపడ్డారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది. తాజాగా అజర్ కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు పంపింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నందుకే వేటు వేసినట్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఒక వర్గంగా.. మాజీ క్రికెటర్లు అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ మరో వర్గంగా ఉన్నారు. హెచ్‌సీఏలో ఈ వివాదాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. వీటిని పరిష్కరించి, సంస్థను ప్రక్షాళన చేయడం కోసం కోసం గతంలో ఎన్నో కమిటీలు వేసినా ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. మరో సారి హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై వేటు వేయడం ఇంకా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గొడవలు సద్దుమణగలేదనే దానికి నిదర్శనం. ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేసింది.

హెచ్‌సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించడంలేదని.. ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయని చెప్పారు. అజార్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విషయంపై కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేసి, ఆ కేసును సీబీఐతో పునర్విచారణ జరిపించాలని కోరతామని యెండల లక్ష్మీనారాయణ తెలిపారు.

హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ గురువారం నాడు స్పందించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనకు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసిందని.. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్ మెన్ నియమిస్తే అడ్డుకొన్నారని అజర్ ఆరోపించారు. వాళ్ల అవినీతి బయటపడుతోందనే ఉద్దేశ్యంతోనే తనపై కుట్రలు పన్నారని.. హెచ్‌సీఏ గౌరవానికి ఏనాడూ భంగం కల్గించేలా చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.


Next Story
Share it