తొలి రోజు వాషింగ్టన్ సుందర్.. రెండో రోజు సాంట్నర్.. ఒకేలా దెబ్బ‌కొట్టారు..!

పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోయింది

By Medi Samrat  Published on  25 Oct 2024 9:36 AM GMT
తొలి రోజు వాషింగ్టన్ సుందర్.. రెండో రోజు సాంట్నర్.. ఒకేలా దెబ్బ‌కొట్టారు..!

పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోయింది. న్యూజిలాండ్ 259 పరుగులకు బదులుగా టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బౌలర్ల ధాటికి భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో నిలవలేకపోయారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ భార‌త ప‌త‌నంలో అతిపెద్ద పాత్ర పోషించాడు.

ఈ టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత ఆటగాడు వాషింగ్టన్ సుందర్ చేసిన పనిని సాంట్నర్ కూడా రిపీట్ చేశాడు. తొలి రోజు సుందర్ ఏడు వికెట్లు తీసి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. రెండో రోజు సాంట్నర్ ఏడు వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియాను దారుణంగా దెబ్బతీశాడు.

సాంట్నర్ 19.3 ఓవర్లలో 53 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. అతని టెస్టు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. శుభ్‌మన్ గిల్ వికెట్‌తో సాంట్నర్ రోజును ప్రారంభించాడు. దీని తర్వాత అతడు విరాట్ కోహ్లీని పెవిలియ‌న్ పంపాడు. బెంగళూరులో సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ కూడా సాంట్నర్‌కు బౌలింగ్‌కే బలయ్యాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా వికెట్లు పడగొట్టాడు.

Next Story