టోక్యో ఒలింపిక్స్-2021లో భారత్‌కు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తొలి పతకం అందించిన విషయం తెలిసిందే. మీరాబాయి చాను స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో రజతం గెలవగా.. చైనా వెయిట్ లిఫ్టర్ ఝిహుయి హౌ స్వర్ణం దక్కించుకుంది. అయితే, మీరాబాయి చాను రజత పతకం ఇప్పుడు స్వర్ణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం చైనా లిఫ్టర్ ఝిహుయి హౌకు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు మరిన్ని డోప్ టెస్టులు నిర్వహించాలని భావిస్తుండడమే. ఝిహుయి హౌ ఈ డోప్ టెస్టుల్లో విఫలమైతే మీరాబాయి చానును స్వర్ణ విజేతగా ప్రకటిస్తారు.
ఇదిలావుంటే.. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో ఝిహుయి.. స్నాచ్‌లో 94 కిలోలు , క్లీన్ అండ్ జర్క్‌లో 116 కిలోలు.. మొత్తంగా 210 కిలోలు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మీరాబాయి చాను.. స్నాచ్‌లో 87 కిలోలు , క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోల బరువు ఎత్తి రెండవ స్థానంలో రజతంతో సరిపెట్టుకుంది. ఇండోనేషియా వెయిట్‌లిఫ్టర్ విండీ కాంటికా 194 కిలోల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. అయితే.. ఝిహుయి డోప్ టెస్టుల్లో విఫలమైతే వీరు అందుకున్న పతకాలు మారే అవకాశం ఉంది.