Video : ఓటమి బాధతో.. విజయమే లక్ష్యంగా.. స్వ‌దేశానికి బయలుదేరిన టీమిండియా

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

By Medi Samrat  Published on  8 Jan 2025 9:34 AM IST
Video : ఓటమి బాధతో.. విజయమే లక్ష్యంగా.. స్వ‌దేశానికి బయలుదేరిన టీమిండియా

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో కంగారూ జట్టు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ని 3-1తో కైవసం చేసుకుంది. దీంతో 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓడిపోయింది. అయితే.. మూడు రోజుల్లోనే సిడ్నీ టెస్టు ముగియడంతో టీం ఇండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది స్వదేశానికి వచ్చేందుకు వేచి చూడాల్సి వచ్చింది.

రెండు నెలల సుదీర్ఘ భారత పర్యటన జనవరి 7న ముగియాల్సి ఉండ‌గా.. మ్యాచ్ అంతకు ముందే ముగియడం వల్ల టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలోనే ఉండాల్సి వచ్చింది. ఇటీవల వార్తా సంస్థ PTI షేర్ చేసిన వీడియోలో.. టీమిండియా ఆటగాళ్లు బస్సులో సిడ్నీ విమానాశ్రయానికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ సిరీస్ ఓట‌మితో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలన్న టీమిండియా కల చెదిరిపోగా, కంగారూ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు WTC ఫైనల్ 2025 దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఘోర పరాజయం తర్వాత.. భారత జట్టు ఈ రోజు అంటే 8 జనవరి 2025న సిడ్నీ నుండి ఇంటికి బయలుదేరింది. ఈ వీడియోను వార్తా సంస్థ PTI షేర్ చేసింది. వీడియోలో అందరు ఆటగాళ్లు కనిపించక‌పోవ‌డ‌తో.. 2 రోజుల క్రితమే టెస్టు ముగియడం వల్ల ఆటగాళ్లందరికీ టికెట్లు అందజేయలేకపోయిన‌ట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజ‌ముంద‌నేది తెలియాల్సివుంది.

ఇదిలాఉంటే.. టీమిండియా జ‌న‌వ‌రి 22 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో గెలిచి ఐసీసీ ఛాంఫియ‌న్స్ ట్రోఫీకి రెట్టించిన ఉత్సాహంతో వెళ్లాల‌ని ఉంది.

Next Story