వరుసగా 8 సిక్సర్లు బాదేశాడు..!

మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి తుఫాను ఇన్నింగ్స్ ఆడి రికార్డు బుక్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు.

By -  Medi Samrat
Published on : 10 Nov 2025 6:13 PM IST

వరుసగా 8 సిక్సర్లు బాదేశాడు..!

మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి తుఫాను ఇన్నింగ్స్ ఆడి రికార్డు బుక్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. సూరత్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆకాష్ కుమార్ చౌదరి వరుసగా ఎనిమిది సిక్సర్లు కొట్టి రికార్డులు బద్దలు కొట్టాడు. ఆకాష్ కుమార్ చౌదరి కేవలం 11 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే.. 12 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన లీసెస్టర్‌షైర్ ఆటగాడు వేన్ వైట్ (2012) రికార్డును బద్దలు కొట్టాడు.

ఆకాష్ కుమార్ చౌదరి 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను మొదటి బాల్ డాట్ ఆడాడు. తర్వాత రెండు సింగిల్స్ తీసుకున్నాడు. 3 బంతుల్లో రెండు పరుగులు చేసి ఆడుతున్న చౌదరి తన గేర్ మార్చి తర్వాతి ఎనిమిది బంతుల్లో వరుసగా ఎనిమిది సిక్సర్లు బాదాడు. చౌదరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లిమర్ దాబీ వేసిన ఇన్నింగ్స్ 126వ ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. ఈ విధంగా చౌదరి వెటరన్ క్రికెటర్లు రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్ స‌ర‌స‌న‌ చేరాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో శాస్త్రి, సోబర్స్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టారు. రికార్డు ఇన్నింగ్స్ ఆడినందుకు ఆకాష్ చౌదరి తన కోచ్‌కి క్రెడిట్ ఇచ్చాడు.

మంచి షాట్లు ఆడ‌డం నా అదృష్టం. నా ఉద్దేశాలు ఎప్పుడూ సరైనవే. నేను ఎప్పుడూ క్రికెట్‌లో 100 శాతం ప్ర‌ద‌ర్శ‌న‌ ఇస్తాను. దీనివ‌ల్ల‌ ఫలితాలు స్వయంచాలకంగా వస్తాయి. నేను ఎల్లప్పుడూ నా గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను. జట్టుకు 100 శాతం సహకారం అందిస్తాను. వెంటనే మా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేయాలని కోచ్ చెప్పాడు. అందుకే నేను స్వేచ్ఛగా ఆడగలిగానని పేర్కొన్నాడు. మేఘాలయ 628/6 స్కోరు వద్ద తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆకాష్ 14 బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తను 357 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.

Next Story