లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో బాల్ ట్యాంపరింగ్ కలకలం రేపింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ బూట్ల కింద బంతిని పెట్టి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఆటగాళ్లు బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాల్ ట్యాంపరింగ్ ప్రయత్నమేనని నెటిజన్లు ఆరోపిస్తూ ఉన్నారు. బంతిని బూట్ల కింద ఉంచి అదుముతున్నట్టుగా ఉన్న మూడు ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ పనికి పాల్పడ్డ ఆటగాళ్లు ఎవరనేది తెలియరావడం లేదు.
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మరికొందరు క్రికెటర్లు కూడా దీనిపై స్పందించారు. ఇది బాల్ ట్యాంపరింగా? లేక, కరోనా నివారణ చర్యా? అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు. అప్పటికి వికెట్ కీపర్ రిషబ్ పంత్ (14), సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (4) నాటౌట్‌గా ఉన్నారు. దాంతో రెండో టెస్ట్ మ్యాచ్‌పై భారత్ పట్టు కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. చివరి రోజు ఉదయం పంత్ ఆటపై భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి. అంతకుముందు వైస్ కెప్టెన్ అజింక్య రహానే (61), టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారా (45) నాలుగో వికెట్‌కు వందకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. కాస్త స్పిన్ కు కూడా లార్డ్స్ పిచ్ సహకరిస్తూ ఉండడం.. భారత్ 200కు పైగా ఆధిక్యం సంపాదిస్తే చాలు మ్యాచ్ ఎలాగైనా మలుపు తిరగొచ్చు.