పారాలింపిక్స్‌లో భారత్ జోరు.. పతకాల పట్టికలో రెండంకెల స్థానంలోకి..!
Mariyappan Thangavelu Wins Silver, Sharad Kumar Takes Bronze. పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు స్ఫూర్తిదాయకమైన ప్రతిభ కనబరుస్తున్నారు.
By అంజి Published on 1 Sept 2021 9:14 AM IST
టోక్యో : పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు స్ఫూర్తిదాయకమైన ప్రతిభ కనబరుస్తున్నారు. తాజాగా పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య రెండంకెల స్థానంలోకి చేరింది. పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు 10 పతకాలు సాధించి 30వ స్థానంలో కొనసాగుతోంది. షూటింగ్‌లో సింగ్‌రాజ్ అదానా కాంస్య పతకం గెల్చుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎన్‌హెచ్ 1 విభాగంలో ఫైనల్లో కాంస్య పతకం నెగ్గి అంచనాలు అందుకున్నాడు. హర్యాణకు రాష్ట్రానికి చెందిన సింగ్‌రాజ్ తన చిన్న వయసులోనే పోలియో బారినపడ్డాడు. సింగ్‌రాజ్ తాతా గారు భారత స్వతంత్ర సమరయోధుడు. సింగ్‌రాజ్ అధానా తన మేనల్లుడిని రోజు షూటింగ్ రేంజ్ వద్ద దిగపెట్టి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతనికి షూటింగ్‌పై మక్కువ ఏర్పడింది. కోచ్‌ల సాయంతో అతడు షూటింగ్‌లో మరింత రాటు దేలాడు. 35 ఏళ్ల వయసులో గన్ పట్టుకున్న సింగ్‌రాజు... తన కోచ్‌లు నౌతియా, ఓంప్రకాష్, సుభాష్ రాణాల శిక్షణతో ఆటపై పట్టు సాధించాడు. లాక్‌డౌన్ సమయంలో అంతదూరం ప్రయాణం కాస్త ఇబ్బందిగా మారడంతో.. తన ఇంటి వద్దనే షూటింగ్ స్పాట్‌ను ఏర్పర్చుకున్నాడు. సింగ్‌రాజ్ అధానా 2018వ సంవత్సరంలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ప్రపంచకప్ షూటింగ్‌లో బంగారు పతకం గెల్చుకున్నాడు. అదే సంవత్సరం ఆసియా క్రీడ్లలోనూ కాంస్య పతకం నెగ్గాడు. ఆ తర్వాత యూఏఈలో జరిగిన ప్రపంచకప్‌లో సింగ్‌రాజా వ్యక్తిగత స్వర్ణంతో పాటు.. టీమ్ కాంస్య పతకాన్ని సాధించాడు.
హైజంప్‌లో మరియప్పపన్ తరంగవేలుకు రజతం, శరద్ కుమార్‌కు కాంస్యం
2016 రియో పారాలింపిక్స్ స్టార్ మరియప్పన్ తరంగవేలు టోక్య పారాలింపిక్స్‌లో మళ్లీ అదరగొట్టాడు. ఈ సారి పురుషుల హైజంప్ టీ -42 విభాగంలో రజత పతకం సాధించాడు. 1.86 మీటర్ల ఎత్తుకు ఎగిరి హైజంప్ చేశాడు మరియప్పన్. అయితే తాను పోటీలోకి దిగే సమయంలోనే వర్షం రావడంతో.. అది తన స్వర్ణ అవకాశాలను ప్రభావితం చేసిందని మరియప్పన్ తెలిపాడు. తమిళనాడుకు చెందిన మరియప్పన్ కడుపేదరిక కుటుంబంలో పుట్టాడు. మరియప్పన్ స్వస్థలం సేలం జిల్లా పెరియవదగపట్టి గ్రామం. మరియప్పన్ తల్లి కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని నడిపిస్తోంది. విధి తల రాతో.. మరెమో గానీ విధి వెక్కిరించింది. ఐదేళ్ల వయసులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అతనికి అంగవైకల్యాన్ని తెచ్చిపెట్టింది. బస్సు డ్రైవర్ మద్యం సేవించి మరియప్పన్ ఢీకొట్టాడు. దీంతో అతని మోకాలు కింది భాగం నుజ్జు అయింది. అయితే వైకల్యం ఉన్నా మిగిలిన కుర్రాళ్లతో కలిసి ఆడుతుండేవాడు. బెంగళూరులోని స్పోర్ట్స్ అకాడమీలో కోచ్ సత్యనారాయణ దగ్గర శిక్షణ తీసుకున్న మరియప్పన్ రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. అటు తర్వాత 2018 పారా ఆసియా కీడ్రీల్లో కాంస్యం నెగ్గాడు. ఇప్పుడు తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని ముద్దాడాడు.
మరో భారత అథ్లెట్ శరద్ కుమార్ టి-42 విభాగంలో హైజంప్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. 1.83 ఎత్తు ఎగిరి బార్ అవతల పడ్డాడు. దీంతో అతడు కాంస్య పతకం గెలిచిన అథ్లెట్‌గా ఘనత సాధించాడు. శరద్ కుమార్ స్వస్థలం బీహార్‌లోని మోతీపుర గ్రామం. శరద్ రెండేళ్ల వయసులో పోలియో బారినపడ్డాడు. శరద్‌ను పెంచేందుకు అతని తల్లిదండ్రులు చాలా కష్టపడాల్సి వచ్చింది. అతని చికిత్స కోసం పాట్నా, కోల్‌కత్తా, చెన్నైలో చాలా ఆస్పత్రల్లో చికిత్స చేపించారు. ఆటలకు వైకల్యం అడ్డుకాదని భావించిన శరద్... తన చిన్ననాటినుండే ఆటలపై ఆసక్తి పెంచుకున్నాడు. తన సోదరుడు హైజంప్ చేయడం చూసి తానుకూడా ఈ ఆటను నేర్చుకోవాలని అనుకున్నాడు. హైజంప్‌పై ఆసక్తితో చాలా రోజుల పాటు పట్టుదలతో హైజంప్‌ను అభ్యసించాడు. 2009లో జాతీయ జూనియర్ పారా అథ్లెటిక్స్ పోటీల్లో శరద్ స్వర్ణం సాధించాడు. అటు తర్వాత పలు అంతార్జాతీయ క్రీడల్లోనూ మెరిసి పతకాలు సాధించాడు.