Video : ఆ మొండితనాన్ని వదల‌కూడదు.. నిన్నే.. 'ష‌మీ' మాట‌లు విను ఒక‌సారి..!

ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ నుంచి భారత జట్టు సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ తిరిగి జాతీయ జట్టులోకి వస్తున్నాడు.

By Medi Samrat  Published on  22 Jan 2025 12:06 PM IST
Video : ఆ మొండితనాన్ని వదల‌కూడదు.. నిన్నే.. ష‌మీ మాట‌లు విను ఒక‌సారి..!

ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ నుంచి భారత జట్టు సీనియర్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ తిరిగి జాతీయ జట్టులోకి వస్తున్నాడు. 15 నెలల తర్వాత షమీ జాతీయ జట్టు జెర్సీ ధరించి మైదానంలోకి రానున్నాడు. ICC ODI వరల్డ్ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత షమీ గాయపడ్డాడు. దీని తర్వాత అతడు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.. కానీ అతను పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ సమయంలో అతను చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు తన పునరాగమనం వేళ అతడు గాయం నుండి ఎలా కోలుకున్నాన‌నేది చెప్పాడు. అతడికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.

మహ్మద్ షమీ కోలుకున్నాక బెంగాల్ టీమ్ త‌రుపున‌ దేశవాళీ క్రికెట్‌లో ఆడి ప్ర‌త్య‌ర్ధుల‌కు చెమటలు పట్టించాడు. షమీ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో ఆడి మళ్లీ ఫామ్‌లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ కారణంగానే అతడు జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరగ‌నున్న‌ టీ20 సిరీస్ ద్వారా మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులోకి రానున్న నేప‌థ్యంలో వీడియో వైరల్ అవుతోంది.

బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో షమీ గాలిపటం ఎగురవేస్తూ కనిపించాడు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌న‌ప్ప‌టి నుంచి చాలా ఏళ్లుగా గాలిపటం ఎగురవేసే అవకాశం రాలేదని.. 15 ఏళ్ల తర్వాత ఈరోజు గాలిపటం ఎగురవేస్తున్నాను అని షమీ చెప్పాడు. ‘‘ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి బంతినే చేతిలో పట్టుకున్నా.. బ్యాలెన్స్‌ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు.. క్రికెట్‌ లైఫ్‌లో లాగే ఇక్క‌డ‌ బ్యాలెన్స్‌ చాలా ముఖ్యం. సెట్‌లో ఉంటే పరుగులు చేస్తాం, పిచ్‌ని అర్థం చేసుకుంటే.. వికెట్లు తీస్తాం. గాలిపటం విషయంలో కూడా అదే జరుగుతుంది.. సరైన బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తే అది కూడా సాఫీగా ఎగురుతుంది. చూడు.. అది మాంజా అయినా, బాల్ అయినా, డ్రైవింగ్ అయినా.. మీకు పెద్ద‌గా తేడా కనిపించదు. మీపై మీకు నమ్మకం ఉండాలి.. మీరు పరుగులు చేస్తున్న‌ప్పుడు.. వికెట్లు తీస్తున్నప్పుడు అందరూ మీతో ఉంటారు.. గాయాల‌ సమయంలో మీతో ఎవరు నిలబడతారు అనేదే నిజమైన పరీక్ష.. నేను పరుగెత్త‌డానికి కూడా భయపడేవాడిని.. గాయం నుండి కోలుకోవ‌డానికి ఎన్‌సిఎకు వెళ్లడం ఏ ఆటగాడికైనా చాలా కష్టం.. గాయంతో వెళ్ళినప్పుడు తిరిగి బలంగా రావాలి.. ఇది పూర్తయింది, ఇప్పుడు నేను దానిని దాటాను.. మనం చిన్నగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు నడక నేర్పుతారు.. మనం పడిపోతాం.. లేస్తాం.. కానీ మనం నడక నేర్చుకోకుండా ఉండం.. ఆ మొండితనాన్ని నువ్వు వదులుకోకూడదు.. అదే వృత్తిలో కూడా.. మనం వదిలివేయకూడదు.. గాయాలు అయినా.. లేచి దేశం కోసం, జట్టు కోసం మ‌నం పునరాగమనం చేయాలి అంటూ ముగించాడు. ష‌మీ మాట‌లు జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఎంతోమందికి, చిన్న చిన్న విష‌యాల‌కే కుంగిపోతున్న చాలా మందికి ఇన్ష్‌ఫిరేష‌న్‌గా నిలుస్తాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.

Next Story